breaking news
Space Research Organization of the United
-
ఆందోళన రేపుతున్న అధికార మార్పిడులు
భారత జాతీయ అంతరిక్ష సంవర్ధన– ప్రాధికరణ సంస్థ (ఇన్–స్పేస్) ఈమధ్య వార్తలకెక్కింది. భారత అంతరిక్ష కార్యక్ర మాల భవిష్యత్తు గురించి ఆ సంస్థ చైర్మన్ పవన్ గోయెంకా చేసిన ప్రకటన వివాదా నికి కారణమైంది. దానిపై భారత అంత రిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన శాస్త్రవేత్తల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతరిక్ష పరిశోధనా సంస్థను ప్రైవేటీకరించే ప్రణాళికలు ఏవీ లేవని గోయెంకా వెంటనే ఖండన విడుదల చేశారు. అలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇస్రో కూడా స్పష్టం చేసింది. అయితే, ఈ ఉదంతం విధాన నిర్ణయాలలోని కీలకమైన లొసుగులను ఎత్తి చూపింది. ఆ లొసు గులు ఒక్క ఇస్రోలో మాత్రమే కాక, మొత్తం వైజ్ఞానిక సంస్థలన్నింటి లోనూ తీవ్రమైన పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. దేన్ని నియంత్రిస్తుంది?సైంటిస్టులను, శాస్త్ర–సాంకేతిక రంగానికి చెందిన పెద్దలను విశ్వాసంలోకి తీసుకోకుండా, వర్తమాన పరిస్థితులకు తగని విధంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇన్–స్పేస్’ను ఏర్పాటు చేసింది. తొమ్మిది స్టాఫ్ యూనియన్లు సెప్టెంబర్ 4న రాసిన లేఖ ఆ సంగతిని ప్రతిబింబి స్తోంది. ఇన్–స్పేస్‌ను ఐదేళ్ళ క్రితం ఏర్పాటు చేశారు. కానీ, అది నిర్వహించే పాత్ర ఏమిటో ఇంతవరకూ స్పష్టం కాలేదు. ‘దోహదకారి–నియంత్రణ’ల పాత్ర రెండింటినీ నిర్వహించే దిగా దాన్ని కేంద్ర ప్రభుత్వ, ఇస్రో పెద్దలు అభివర్ణిస్తూ వస్తున్నారు. అంకుర సంస్థలకు ద్వారాలు తెరిచే ఏకగవాక్ష బిందువుగా దాని దోహదకారి పాత్రను అర్థం చేసుకోవచ్చు. కానీ, నియంత్రణ పదమే పక్కదోవ పట్టించేదిగా ఉంది. చట్ట బద్ధత కలిగిన నియంత్రణా చట్రం ఏదీ లేకుండానే ప్రైవేటు రంగ ప్రవేశానికి ప్రభుత్వం పురికొల్పింది. ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రదేశాలను కేటాయించడం నుంచి భూమిపైన లేదా కక్ష్యలో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే బాధ్యత వహించడం నుంచి బీమా వరకు అంతరిక్ష కార్యకలాపాలలో అంతర్జాతీయ నియమ నిబంధ నలు చాలా ఉంటాయి. కనుక, తగిన నియంత్రణా వ్యవస్థ తప్పని సరిగా ఉండాలి. ఇస్రో ఒక అంతరిక్ష చట్టాన్ని మొదట 2015లో ప్రతిపాదించింది. దానిపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ‘ఇన్–స్పేస్’ను ఏర్పాటు చేస్తూ 2023లో నూతన అంతరిక్ష విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు రంగం చేపట్టే అంతరిక్ష కలాపాలను నియంత్రించేందుకు ఒక సమగ్ర లీగల్ ఫ్రేమ్ వర్క్‌ను కల్పించేందుకు స్పేస్ బిల్లు ఎట్టకేలకు 2025లో సిద్ధమైంది. రెండూ ఒకే చేతులోనా?ఇన్–స్పేస్‌తో ఇతర సమస్యలూ ఉన్నాయి. అంతరిక్ష శాఖ (డాస్) కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా దాన్ని వర్గీకరించారు. అదే శాఖ ఇస్రో పాలనా వ్యవహారాలను కూడా చూస్తోంది. ఒకవేళ ఇన్–స్పేస్ రెగ్యులేటర్‌గా వ్యవహరించదలిస్తే, ఇక్కడ ప్రయోజనాల ఘర్షణ ఇమిడి ఉంది. ఎందుకంటే, ఇస్రో చైర్మన్ ‘డాస్’కు కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రతిపాదిత స్పేస్ చట్టం కింద రెగ్యులేటర్‌గా వ్యవహరించేందుకు ఇన్–స్పేస్ లీగల్ అథారిటీని పొందిందని అనుకుందాం. ఇప్పటిలాగా, అది చేయూతనిచ్చే సంస్థగా కూడా కొనసాగగలుగుతుందా? నియంత్రణ, వెసులుబాటు రెండూ ఒకరి చేతుల్లోనే ఉండకూడ దనేది ఒక తిరుగులేని సూత్రం. అందుకనే, 1990లలో టెలికామ్ రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశానికి అనుమతించినప్పుడు, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అనే చట్ట పరమైన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, టెలికమ్యూనికేషన్ల శాఖకు చెందిన నియంత్రణ విధులను దానికి అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా, ఇస్రోకు సమానమైన సంస్థగా ఇన్–స్పేస్‌ను సృష్టించింది. ఇస్రో మాదిరిగానే, దానికి కూడా ఒక చైర్మన్ ఉంటారు. కనీసం ప్రజా దృష్టిలో, రెండు అధికార కేంద్రాలు ఏర్పడినట్లయింది. విస్తృత అంతరిక్ష విధానం–దిశా నిర్దేశం గురించి ఇన్–స్పేస్ చైర్మన్ చేసిన ప్రకటనను ఈ దృష్టి కోణం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రైవేటు రంగానికి వీలు కల్పించడానికి ఇన్–స్పేస్ పేరుతో వేరొక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇస్రోకు చెందిన రెండు వాణిజ్య విభాగాలు– యాంట్రిక్స్ కార్పొరేషన్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ – ఆ పనిని ఇప్పటికే నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు రంగంతో ముఖాముఖి జరపడంలో ఆ రెండింటికి కలిపి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఇపుడు కూడా ఇన్–స్పేస్ ఆ వెసులుబాటుకు ముందుస్తు సన్నాహాలను మాత్రమే చూస్తోంది. అమలు బాధ్యతనంతటినీ ఇస్రోయే చూసుకుంటోంది. అంతటా అదే కథఇస్రోలో మాదిరిగానే ఇతర సైంటిఫిక్ ఏజెన్సీలు కూడా అధికార మార్పిడులకు లోనవుతున్నాయి. శాస్త్రీయ పరిశోధనకు, నిధులు అందుకునే ప్రాజెక్టులకు శాస్త్ర–సాంకేతిక శాఖ (డీఎస్టీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ బోర్డ్ ద్వారా అది ఆ పనులను చక్కబెట్టేది. అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) పేరుతో కొత్త సంస్థను నెలకొల్ప డంతో డీఎస్టీ దాని ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఈ ఫౌండేషన్ పాలక మండలికి ప్రధాని అద్యక్షత వహిస్తున్నారు. ప్రభుత్వ నిధుల సాయంతో సాగే పరిశోధనకు ఐదేళ్ళ కాలానికి ఈ ఫౌండేషన్‌కు రూ. 50,000 కోట్లు కేటాయించారు. కేవలం ప్రైవేటు రంగానికుద్దేశించి పరిశోధన–అభివృద్ధి–నవీకరణ (ఆర్డీఐ) నిధికి ఆరేళ్ళ కాలానికి రూ. లక్ష కోట్లు కేటాయించారు. నిధులను వెచ్చించవలసిన తీరు నిర్ణయాల్లోకానీ, పరిశోధన–అభివృద్ధికి సంబంధించి దిశా నిర్దేశం చేయడంలోకానీ డీఎస్టీ పాత్ర నామమాత్రమే. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధికా రాలను తగ్గించేందుకు కూడా సాగుతున్న ఇటువంటి ప్రయత్నాల గురించి గతంలో వివరించడం జరిగింది. ఆరోగ్య పరిశోధనకు మార్గదర్శనం చేసే బాధ్యతను మెడికిల్ సైంటిస్టులు, ప్రజారోగ్య నిపుణుల నుంచి తప్పిస్తున్నారు. ముఖ్య సైంటిఫిక్ సలహాదారు అధ్యక్షతన గల కేంద్రీకృత జాతీయ ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ ఇపుడు జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండాను నిర్ణయిస్తుందన్నమాట. కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులే ఉంటారు. ఆరోగ్య పరిశోధనా శాఖ అమలుపరచే సంస్థగా ఉంటుంది. ‘శాస్త్రీయ, సాంకేతిక అమలు’కు బాధ్యత వహిస్తూ ఐసీఎంఆర్ చివరి అంచెలో ఉంటుంది. ఈ అధికార మార్పిడులన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి నిర్ణాయక అధికారాలను సాంకేతికేతర వ్యక్తుల చేతుల్లో పెడు తున్నాయి. నిర్ణయాల ప్రక్రియను కేంద్రీకృతం చేస్తున్నాయి. సైంటి ఫిక్ ఏజెన్సీల స్వయంప్రతిపత్తిని నీరుగారుస్తున్నాయి. ఇవన్నీ చివరకు, ప్రభుత్వ నిధులతో సాగే పరిశోధన–అభివృద్ధి సంస్థల నుంచి నైపుణ్యం, ప్రతిభా సామర్థ్యాలు మృగ్యమయ్యేందుకు దారి తీయవచ్చు. ఇస్రో సైంటిస్టుల లేఖ అటువంటి సంస్థలకు ఒక మేల్కొలుపు. వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
చందమామను చుట్టొచ్చేలా...
మనిషి చివరిసారిగా చంద్రునిపై దిగి 50 ఏళ్లు దాటింది. అర్ధ శతాబ్ది సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆర్టెమిస్–2 స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్ శనివారం కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ ప్యాడ్‌కు చేరింది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఫిబ్రవరి 6న ఆర్టెమిస్–2 ప్రయోగం జరగనుంది. దీనిద్వారా నలుగురు వ్యోమగాములు ఓరియాన్ స్పేస్ క్యాప్సూల్‌లో చంద్రుని చుట్టూ పరిభ్రమించి రానున్నారు. అమెరికాకు చెందిన నాసా కమాండర్ రీడ్ వైజ్మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన జెరెమీ హన్సెన్ ఈ మిషన్‌లో భాగస్వాములు. ఓరియాన్ క్యాప్సూల్ భూ దిగువ కక్ష్యను దాటుకుని చంద్రుని చుట్టూ ఓ రౌండ్ కొట్టి భూమికి 10 రోజుల అనంతరం తిరిగి వస్తుంది. తద్వారా వ్యోమగాములు చంద్రునిపై దిగేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేస్తుంది. అనంతరం ఆర్టెమిస్–3 మిషన్‌లో భాగంగా వ్యోమగాములను చంద్రునిపై దింపాలన్నది నాసా లక్ష్యం. ఆర్టెమిస్–2 ఫలితాన్ని బట్టి 2027లో గానీ, 2028లో గానీ ఈ మిషన్‌ను చేపట్టే అవకాశముంది. నాసా చివరిసారిగా 1972లో అపోలో 17 మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వ్యోమగాములను పంపింది. ఆర్టెమిస్–2 ఎస్ఎల్ఎస్ రాకెట్ ఎత్తు ఏకంగా 100 మీటర్లు కావడం విశేషం. ఇక దీని బరువు 5,000 టన్నులు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
2030 నాటికి ఇస్రో నుంచి స్పేస్ టూరిజం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3, సూర్యయాన్ వంటి ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్‌యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది. మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్సైట్లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయమవుతుందని తెలిపారు. కాగా యువత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బీవీ సుబ్బారావు సూచించారు. సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు’ అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీవీ సుబ్బారావు మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర.. నేడు చంద్రుడు, సూర్యుడిపై అధ్యయనం కోసం గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే స్థాయికి చేరిందని వివరించారు. -
గ్రహశకలంపై వాలిన ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై వాలింది. మంగళవారం ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఒసిరిస్ రెక్స్‌ను గ్రహశకలంపై దింపగలిగారు. ‘నేలపై వాలడం పూర్తయింది’అన్న ప్రకటన వినగానే కేంద్రంలోని శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రోబోటిక్ అంతరిక్ష నౌకను నియంత్రించడం, దానితో బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు!. నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది. ఓ మినీ వ్యాన్ అంత సైజుండే ఒసిరిస్ 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది. ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. 60 గ్రాముల నుంచి 2 కిలోల వరకూ... బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు. మంగళవారం నాటి ప్రయోగం అంతా అనుకున్నట్లుగానే సాగిందని, ఒసిరిస్ రెక్స్ చేయి పీడనంతో కూడిన వాయువును విడుదల చేయడం ద్వారా నమూనాలను సేకరించిందని ప్రాజెక్టు పర్యవేక్షకుడు డాంటే లారెట్టా తెలిపారు. -
‘స్పేస్ ఎక్స్’ ప్రయోగం విజయవంతం.. కానీ...
కేప్ కనవెరాల్: అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో మైలురాయికి అమెరికా సాక్షిగా నిలిచింది. ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు నిమిషాల తర్వాత రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. సముద్రంలో ల్యాం డ్ అవ్వాల్సిన రాకెట్‌లోని మూడో బూస్టర్ కాలిపోయినట్లు ఎలన్ చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఫ్లోరిడాలోని కేప్ కనవెరాల్లో సంబరాలు మిన్నంటాయి. కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’.. తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది. ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు: ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికైతే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. -
కొత్త అన్వేషణ ప్రారంభించనున్న క్యూరియాసిటీ
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకునిపై ఉన్న మౌంట్ షార్ప్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. విస్తారమైన గాలే కార్టర్ మధ్యలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో క్యూరియాసిటీ తన తదుపరి అన్వేషణను ప్రారంభించనుంది. సుమారు రెండేళ్ల తర్వాత, తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం అనంతరం క్యూరియాసిటీ మౌంట్ షార్ప్ బేస్‌కు చేరిందని యూఎస్ స్పేస్ ఏజన్సీ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచానికి తన సత్తా చాటిన క్యూరియాసిటీ ఇప్పుడు కొత్త అన్వేషణను ప్రారంభిస్తుందని నాసా ప్లానెటరీ సైన్స్ డివిజన్ డెరైక్టర్ జిమ్ గ్రీన్ వెల్లడించారు.


