గ్రహశకలంపై వాలిన ఒసిరిస్‌ రెక్స్‌

Nasa Osiris-Rex spacecraft lands on asteroid Bennu in mission - Sakshi

నాసా ప్రయోగం విజయవంతం

నమూనాల సేకరణ పూర్తి

సౌర కుటుంబం రహస్యాలు తెలిసేనా?

వాషింగ్టన్‌: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్‌ అంతరిక్ష నౌక ఒసిరిస్‌ రెక్స్‌ విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై వాలింది. మంగళవారం ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్‌ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్‌ మార్టిన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఒసిరిస్‌ రెక్స్‌ను గ్రహశకలంపై దింపగలిగారు. ‘నేలపై వాలడం పూర్తయింది’అన్న ప్రకటన వినగానే కేంద్రంలోని శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు.

భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రోబోటిక్‌ అంతరిక్ష నౌకను నియంత్రించడం, దానితో బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు!. నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది. ఓ మినీ వ్యాన్‌ అంత సైజుండే ఒసిరిస్‌ 11 అడుగుల పొడవైన రోబోటిక్‌ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది. ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు.

60 గ్రాముల నుంచి 2 కిలోల వరకూ...
బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు. మంగళవారం నాటి ప్రయోగం అంతా అనుకున్నట్లుగానే సాగిందని, ఒసిరిస్‌ రెక్స్‌ చేయి పీడనంతో కూడిన వాయువును విడుదల చేయడం ద్వారా నమూనాలను సేకరించిందని ప్రాజెక్టు పర్యవేక్షకుడు  డాంటే లారెట్టా తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top