ఆర్టెమిస్–2 మిషన్‌కు రంగం సిద్ధం
లాంచ్ ప్యాడ్‌కు చేరిన భారీ రాకెట్
అన్నీ కుదిరితే ఫిబ్రవరి 6న ఆర్టెమిస్–2 ప్రయోగం
విజయవంతమైతే చంద్రునిపైకి వెళ్లనున్న ఆర్టెమిస్–3 మిషన్
ఒకట్రెండేళ్లు పట్టే అవకాశం
మనిషి చివరిసారిగా చంద్రునిపై దిగి 50 ఏళ్లు దాటింది. అర్ధ శతాబ్ది సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆర్టెమిస్–2 స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్) రాకెట్ శనివారం కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్‌కు చేరింది.
అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఫిబ్రవరి 6న ఆర్టెమిస్–2 ప్రయోగం జరగనుంది. దీనిద్వారా నలుగురు వ్యోమగాములు ఓరియాన్ స్పేస్ క్యాప్సూల్‌లో చంద్రుని చుట్టూ పరిభ్రమించి రానున్నారు. అమెరికాకు చెందిన నాసా కమాండర్ రీడ్ వైజ్‌మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన జెరెమీ హన్సెన్ ఈ మిషన్‌లో భాగస్వాములు. ఓరియాన్ క్యాప్సూల్ భూ దిగువ కక్ష్యను దాటుకుని చంద్రుని చుట్టూ ఓ రౌండ్ కొట్టి భూమికి 10 రోజుల అనంతరం తిరిగి వస్తుంది.
తద్వారా వ్యోమగాములు చంద్రునిపై దిగేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేస్తుంది. అనంతరం ఆర్టెమిస్–3 మిషన్‌లో భాగంగా వ్యోమగాములను చంద్రునిపై దింపాలన్నది నాసా లక్ష్యం. ఆర్టెమిస్–2 ఫలితాన్ని బట్టి 2027లో గానీ, 2028లో గానీ ఈ మిషన్‌ను చేపట్టే అవకాశముంది. నాసా చివరిసారిగా 1972లో అపోలో 17 మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వ్యోమగాములను పంపింది. ఆర్టెమిస్–2 ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్ ఎత్తు ఏకంగా 100 మీటర్లు కావడం విశేషం. ఇక దీని బరువు 5,000 టన్నులు!
– సాక్షి, నేషనల్ డెస్క్


