Photo credit: PCA X
ఆస్ట్రేలియా- ‘ఎ’ మహిళలతో అనధికారిక వన్డే సిరీస్‌ను భారత్ గెలుపుతో ఆరంభించింది. మొహాలీ వేదికగా తొలి వన్డేలో పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భారత మహిళల ‘ఎ’ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
టీ20 సిరీస్‌లో పరాభవం.. క్లీన్‌స్వీప్
కాగా మూడు అనధికారిక టీ20, మూడు వన్డే, ఏకైక టెస్టు ఆడేందుకు ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆసీస్ ఆతిథ్య జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి అనధికారిక వన్డే జరిగింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46.3 ఓవర్లలో 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
రాణించిన భారత బౌలర్లు
ఆసీస్ ఓపెనర్లలో రేచల్ ట్రెనామన్ (36), కెప్టెన్ తహీలా విల్సన్ (48).. చరిల్ నాట్ (39) మెరుగైన ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అమన్‌దీప్ కౌర్ రెండు, సయాలీ సత్గరే ఒక వికెట్ పడగొట్టారు.
తేజల్, అనుష్క హాఫ్ సెంచరీలు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత మహిళా జట్టు.. 41.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ తేజల్ హసాబ్నిస్ అద్భుత అర్ధ శతకం (81) సాధించగా.. అనుష్క శర్మ సైతం హాఫ్ సెంచరీ (55)తో మెరిసింది. లోయర్ ఆర్డర్‌లో నికీ ప్రసాద్ (22 బంతుల్లో 32 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. సయాలీ సత్గరే (25) కూడా రాణించింది.
ఫలితంగా భారత్ 41.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్, ఆసీస్ మహిళల ‘ఎ’ జట్ల మధ్య శుక్రవారం రెండో అనధికారిక వన్డే జరుగనుండగా.. ఇందుకు మొహాలీ వేదిక.


