ఇంగ్లండ్‌లో యువరాజ్ సింగ్‌తో అభిషేక్- వైభవ్ (PC: Instagram)
టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై భారత మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ప్రమాదకర బ్యాటర్లు అని.. స్వదేశంలో విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడుతున్నారని కొనియాడాడు.
విదేశీ గడ్డ మీద మాత్రం
అయితే, అదే సమయంలో విదేశీ గడ్డ మీద మాత్రం అభిషేక్- వైభవ్ తేలిపోతున్నారని సందీప్ పాటిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా అభిషేక్ శర్మ ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 131 పరుగులే చేశాడు.
మరోవైపు.. సంజూ శాంసన్ స్థానంలో తుదిస్థానంలో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ గడ్డ మీదే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 42 పరుగులే చేయగలిగాడు.
ఇక్కడ సింహాలు.. అక్కడ పిల్లులు!
ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ స్పోర్ట్స్‌నెక్ట్స్‌తో మాట్లాడుతూ.. ఈ ఇద్దరు లెఫ్టాండర్ బ్యాటర్ల ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి నేను ఓ విషయం గమనించాను.
ఇండియాకు వెలుపల.. విదేశీ గడ్డపై బాల్ స్వింగ్ అవుతున్న వేళ.. ఇద్దరూ బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ సమస్యను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. లేదంటే.. స్వదేశంలో సింహాలు.. విదేశాల్లో పిల్లుల మాదిరిగా మారిపోతారు. ఇది జరగకూడదు’’ అని సందీప్ పాటిల్ పేర్కొన్నాడు.
జింబాబ్వే గడ్డ మీద ఇరగదీసిన వైభవ్
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వైభవ్ సూర్యవంశీ.. మూడు టీ20లలో వరుసగా 19 బంతుల్లోనే 50, 9 బంతుల్లోనే 20, 49 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు.
ఫలితంగా ఈ సిరీస్‌లో టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. వైభవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. అయితే, స్వదేశంలో ఇటీవల అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్ తిరిగి రావడంతో వాటర్ బాయ్‌గా సేవలు అందించాడు.
అభిషేక్ 30 బంతుల్లోనే
మరోవైపు.. అఫ్గాన్‌తో సిరీస్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా మూడో టీ20లో కేవలం 30 బంతుల్లోనే శతక్కొట్టి.. టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన టీమిండియా బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో సందీప్ పాటిల్ అభిషేక్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇదే ఆట తీరు విదేశాల్లోనూ కొనసాగించాలని ఆకాంక్షించాడు.


