IND vs AUS: భారత్‌ 199 ఆలౌట్‌.. ఆసీస్‌ లక్ష్యం ఎంతంటే? | IND A vs AUS A 1st Unofficial Test Day 3 IND 199 All Out Huge Target To AUS | Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత్‌ 199 ఆలౌట్‌.. ఆసీస్‌ లక్ష్యం ఎంతంటే?

Sep 24 2026 3:30 PM | Updated on Sep 24 2026 3:53 PM

IND A vs AUS A 1st Unofficial Test Day 3 IND 199 All Out Huge Target To AUS

ఆస్ట్రేలియా - ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా ఆతిథ్య జట్టు.. కంగారూలకు భారీ లక్ష్యం విధించగలిగింది. 

శతక్కొట్టిన కుశాగ్రా 
కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (103 బంతుల్లో 57), ఆల్‌రౌండర్‌ తనుశ్‌ కొటియాన్‌ (138 బంతుల్లో 69) అర్ధ శతకాలతో రాణించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్రా శతకం (240 బంతుల్లో 113)తో చెలరేగాడు.

ఫలితంగా పుదుచ్చేరిలో మంగళవారం టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బౌలర్లలో కోరే రొచిసియోలి నాలుగు వికెట్లు తీయగా.. టాడ్‌ మర్ఫీ మూడు, బ్రెండన్‌ డాగెట్‌, ఫెర్గూస్‌ నీల్‌, లియామ్‌ స్కాట్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

తేలిపోయిన ఆసీస్‌ బ్యాటర్లు
ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆటలో తమ మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌.. 171 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సామ్‌ కొన్‌స్టాస్‌ (25), లియామ్‌ స్కాట్‌ (26) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగా.. కంగారూల ఇన్నింగ్స్‌లో ఐదో నంబర్‌ బ్యాటర్‌ జేసన్‌ సంఘా 46 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో స్పిన్నర్‌ షమ్స్‌ ములాని నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆల్‌రౌండర్‌ తనుశ్‌ కొటియాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. పేసర్లలో తుషార్‌ దేశ్‌పాండే రెండు, అన్షుల్‌ కాంబోజ్‌, ప్రఫుల్‌ హింగే తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

పడిక్కల్‌ అర్ధ శతకం.. మరోసారి రాణించిన కుశాగ్రా
ఈ క్రమంలో గురువారం తమ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 39 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ అర్ధ శతకం (88 బంతుల్లో 59) సాధించాడు.

అమన్‌ మోఖడే (9), షేక్‌ రషీద్‌ (0), యశ్‌ రాథోడ్‌ (12), తనుశ్‌ కొటియాన్‌ (8) పూర్తిగా విఫలం కాగా.. లోయర్‌ ఆర్డర్‌లో షమ్స్‌ ములాని (1), అన్షుల్‌ కాంబోజ్‌ (1), తుషార్‌ దేశ్‌పాండే (0), ప్రఫుల్‌ హింగే (4) తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన కుమార్‌ కుశాగ్రా ఈసారి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మర్ఫీ నాలుగు వికెట్లు తీయగా.. లియామ్‌ స్కాట్‌, బ్రెండన్‌ డాగెట్‌ చెరో రెండు, జేసన్‌ సంఘా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా ఆసీస్‌ ముందు 363 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆటకు ఇంకొక్క రోజు మిగిలి ఉంది.

చదవండి: పాకిస్తాన్‌ కెప్టెన్‌గా డేంజరస్‌ ప్లేయర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement