PC: CApondicherry X
ఆస్ట్రేలియా- ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో భారత జట్టు కెప్టెన్ దేవదత్ పడిక్కల్ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో మెరిశాడు.
334 పరుగులకు ఆలౌట్
కాగా భారత్- ఆసీస్ ‘ఎ’ జట్ల మధ్య పుదుచ్చేరి వేదికగా మంగళవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్... మొదటి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (57), తనుశ్ కొటియాన్ (69) అర్ధ శతకాలు బాదగా.. కుమార్ కుశాగ్రా సెంచరీ (113)తో అదరగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ దేవదత్ పడిక్కల్ మాత్రం పద్నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేసి.. టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో జేసన్ సంఘాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
171 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
ఇక బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్.. 171 పరుగులకే కుప్పకూలింది. జేసన్ సంఘా 46 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములాని నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
భారీ ఆధిక్యంలో భారత్
ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. టీ విరామ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తద్వారా.. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి 335 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లలో సాయి సుదర్శన్ (39) ఫర్వాలేదనిపించగా.. అమన్ మోఖడే (9) మరోసారి విఫలమయ్యాడు. దేవదత్ పడిక్కల్ 88 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 59 పరుగులు సాధించాడు. అయితే, లియామ్ స్కాట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి కెప్టెన్ సాబ్ పెవిలియన్ చేరాడు.


