నైరుతి.. ఈ‘సారీ’! | Monsoon caused deep disappointment with Low Rainfall | Sakshi
Sakshi News home page

నైరుతి.. ఈ‘సారీ’!

Sep 28 2026 2:25 AM | Updated on Sep 28 2026 2:25 AM

Monsoon caused deep disappointment with Low Rainfall

పదేళ్లలో అతి తక్కువ వానలు.. రుతుపవనాల సీజన్‌లో 17% లోటు వర్షపాతం

రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 74.06 సెం.మీ.. ప్రస్తుతం నమోదైంది 61.53 సెం.మీ. 

దక్షిణాది జిల్లాల్లో తీవ్ర లోటు.. జోగుళాంబ గద్వాలలో అత్యధికంగా 39% తక్కువ 

పంటల దిగుబడిపై నీలినీడలు.. 

వర్షాల మధ్య విరామంతో శాస్త్రవేత్తల మల్లగుల్లాలు 

ఖరీఫ్‌ సీజన్‌లో 55 లక్షల ఎకరాల్లో వరి  

ఆశలు రేకెత్తించిన సెప్టెంబర్‌ వానలు.. 

ఉత్తర తెలంగాణకు ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి నైరుతి నిండా ముంచింది. రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. గత పదేళ్లలోనే అత్యంత తక్కువ వర్షాలు నమోదైన సీజన్‌గా మిగిలింది. ఎల్‌నినో ప్రభావం, హిందూ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసంతో రాష్ట్రంలో తక్కువ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తం మీద ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది అతి తక్కువ వర్షాలు కురిశాయి. అయితే జూలైలో దాదాపు సాధారణ వర్షపాతం (ఎంత కురిసే అవకాశం ఉందో అంత) నమోదు కాగా,  ఆగస్టులో ఏకంగా 38 శాతం లోటు ఏర్పడింది. కానీ సెప్టెంబర్‌లో కేవలం 8 శాతమే లోటు వర్షపాతం ఉంది. ఈ విధంగా వర్షపాతం తీరు మారడం, వర్షాల మధ్య విరామం పెరగడంతో ఖరీఫ్‌ పంటలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంలో శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఖరీఫ్‌లో పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, ఎల్‌నినో ప్రభావం కొనసాగితే రబీలో మరింత అధిక ప్రభావం పడుతుందని అంటున్నారు. 

ఈ సీజన్‌లో కురిసే వర్షాలే కీలకం 
సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ సీజన్‌లో కురిసే వర్షాలే రాష్ట్రంలో సాగు పరిస్థితులు, తాగునీటి అవసరాలను నిర్ధారిస్తాయి. కానీ ఈ సీజన్‌లో మొత్తంగా అతి తక్కువ వర్షాలే కురిశాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సగటున 74.06 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతంనమోదు కావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 61.53 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 12.53 సెంటీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదైంది. సీజన్‌లో కురిసే వర్షపాతంలో 17 శాతం తక్కువ వానలు కురిశాయి. పదేళ్ల క్రితం గణాంకాలను పరిశీలిస్తే.. 2017 నైరుతి సీజన్‌లో 65.13 సెంటీమీటర్ల వర్షపాతంనమోదై 12 శాతం లోటు నమోదు కాగా.. ఈ ఏడాది వర్షపాతం మరో 5 శాతం తగ్గడం గమనార్హం. 

16 జిల్లాలోనే లోటు: ప్రణాళిక శాఖ 
రాష్ట్ర సగటు సాధారణ వర్షపాతం లోటులో ఉన్నప్పటికీ..ఐదు జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షాలు నమోదు అయ్యాయి. వాతావరణ శాఖ ప్రకారం..మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. అయితే రాష్ట్ర ప్రణాళిక శాఖ 20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలను సాధారణ కేటగిరీలో చేర్చింది. ఈ లెక్కన రాష్ట్రంలో 16 జిల్లాల్లో మాత్రమే లోటు వర్షపాతం ఉన్నట్టు.. మిగిలిన 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు పరిశీలిస్తే ఒక మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 41 మండలాల్లో అధికం, 270 మండలాల్లో సాధారణం, 308 మండలాల్లో లోటు, ఒక మండలంలో తీవ్ర లోటు నమోదైనట్లు వివరించింది. 

వారాల తరబడి డ్రై స్పెల్స్‌
చాలా జిల్లాల్లో  డ్రైస్పెల్స్‌ (వర్షాల మధ్య అంతరాలు) వరుసగా వారాల తరబడి ఉన్నాయి. సాధారణంగా వర్షాలకు అనుకూలంగా ఉన్న సీజన్‌లో రెండు నుంచి నాలుగు రోజులు మాత్రమే డ్రైస్పెల్స్‌ నమోదయ్యేవి. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వారం నుంచి పదిహేను రోజులు చినుకు కూడా కురవని రోజులు ఈ సీజన్‌లో నమోదయ్యాయి. జూన్‌ 1 నుంచి 10వ తేదీ వరకు మెజార్టీ జిల్లాల్లో వర్షాలే కురవలేదు. జూన్‌ 11 నుంచి 24వ తేదీ మధ్య కేవలం ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మాత్రమే వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలే నమోదయ్యాయి. జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో చినుకు పడలేదు. 13 ఆగస్టు నుంచి 18 ఆగస్టు మధ్య కూడా చినుకు జాడ లేదు. అలాగే 26 ఆగస్టు నుంచి 9 సెప్టెంబర్‌ మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వాన జాడే లేదు. ఇంత భారీ అంతరాలతో వానలు కురవడం వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలిగించింది.  

సెప్టెంబర్‌ వర్షాలతో పంటలకు ఊరట 
సెప్టెంబర్‌ చివరి వారంలో కురుస్తున్న వర్షాలు పంటలకు కొంత ఊరటనిస్తున్నాయి. అయితే ఆలస్యంగా కురుస్తున్న ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లోనూ ఒకే స్థాయిలో లేవు. ఉత్తర తెలంగాణలో వర్షాలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు పెరుగుతుండగా, దక్షిణ తెలంగాణలో ఖరీఫ్‌ విషయంలోనే కాకుండా రబీ సాగుకు అవసరమైన నీటి లభ్యతపై కూడా ఆందోళన కొనసాగుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గత ఆగస్టు చివరి నాటికి వ్యవసాయశాఖ అధికారులు వరి ఉత్పత్తి కనీసం 20 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేయగా.. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో ఈ లెక్కల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఉత్తర తెలంగాణలో వరికి ఊపిరి 
రాష్ట్రంలో ప్రస్తుతం వరి సాగు చివరి దశలో ఉంది. ఈ సమయంలో వరి పొలాల్లో తగినంత నీరు అవసరం. ఈ పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాలు ఆయా జిల్లాల్లో వరికి ఉపయోగకరంగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కింద ఉన్న పొలాలకు ఈ వర్షాల వల్ల సకాలంలో నీరు చేరనుంది. సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. నీటి లభ్యతే తుది ఫలితాలను నిర్ణయించనుంది. కానీ వర్షాధార ప్రాంతాల్లో వర్షాల విరామం పెరిగితే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. పత్తి 48.24 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.93 లక్షల ఎకరాలు..ఇలా ఇతర అన్ని పంటలు కలిపి ముందుగా అనుకున్న అంచనాలను మించి 125 లక్షల ఎకరాలకు పైగా సాగవడం గమనార్హం.  

దక్షిణ తెలంగాణలో ఇబ్బందే.. 
ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఉత్తర తెలంగాణలో వరికి కొంత ఊతం ఇచ్చే అవకాశం ఉండగా.. దక్షిణ తెలంగాణలో పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కందులు వంటి పంటలకు కొంత ఇబ్బంది ఎదురుకానుంది. పత్తి, మొక్కజొన్న పంటలకు నేలలో తేమ కీలక పాత్ర పోషిస్తుంది. వర్షాల మధ్య ఎక్కువ విరామం ఉంటే మొక్క ఎదుగుదల, పూత, కాయ, గింజ అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇంకా కోతకు సమయం ఉన్న పంటలకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో పంట కోత దశకు చేరువలో వరుసగా భారీ వర్షాలు పడితే పత్తి కాయలు దెబ్బతినడం, మొక్కజొన్నలో గింజ నాణ్యత తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే పంట ఏ దశలో ఉన్నప్పుడు ఎంత వర్షం పడిందన్నదే కీలకం. 

జిల్లాల వారీగా వర్షపాతం వివారలు.. 
– కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలో 5 శాతం లోపు లోటు వర్షపాతం ఉంది.  
– జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ములుగు జిల్లాలో 15 శాతం లోటు కేటగిరీలో ఉన్నాయి. 
– మహబూబాబాద్, నిర్మల్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 20 శాతం లోటు నమోదైంది. 
– సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో 25 శాతం లోటు వర్షపాతం ఉంది. 
– భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో 30 శాతం లోటు నమోదైంది. 
– ఆదిలాబాద్, వరంగల్, హనుమకొండ, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో 35 శాతం లోటు ఉంది. 
– జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 39% లోటు వర్షపాతం నమోదైంది. 

ఈసారి సీజన్‌ మొత్తం ప్రభావం పడింది... 
ఎల్‌ నినో ప్రభావం కొత్త కానప్పటికీ.. ఈ సీజన్‌ మొత్తం పూర్తి ప్రభావం చూపింది. గతేడాది కేవలం జూన్, జూలైల్లో ప్రభావం పడడంతో తక్కువ వర్షాలు కురిశాయి. పసిఫిక్‌ మహా సముద్రంలో 26–27 డిగ్రీల టెంపరేచర్‌ ఉంటే న్యూట్రల్‌గా పరిగణిస్తారు. కానీ ఈసారి 1.5 డిగ్రీల టెంపరేచర్‌ పెరిగింది. ఆ తీవ్రత లక్షల చదరపు కిలోమీటర్లపై ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటే పరిస్థితి మారుతుంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గితే సానుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. అక్టోబర్, నవంబర్‌లో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలో వర్షాలు పెద్దగా కురిసే అవకాశాలుండవు. ఈసారి ఒకట్రెండు తుపానులు ఏర్పడే అవకాశం ఉందని అంచనా. దీంతో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భావిస్తున్నాం. 
– జి.శ్రీనివాసరావు, మెటీయోరాలజిస్ట్, ఐఏండీ హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement