breaking news
weak monsoon
-
జీడీపీ వృద్ధికి సవాళ్లు..!
ముంబై: అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం విఫలమైనా, నైరుతి రుతుపవనాలు బలహీన పనితీరు చూపించినా భారత ఆర్థిక వ్యవస్థ... వృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. పశ్చిమాసియాకు సంబంధించి మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అవరోధాలు కొనసాగుతున్నట్టు ప్రస్తావించింది.అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. పపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ ఒప్పందం విచ్ఛిన్నం అయితే తిరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. కీలకమైన ఇంధన సరఫరాల్లో సమస్యలు, పెట్టుబడుల వ్యయాలు నిదానించడం, ఆహార భద్రత ఆందోళనలు, ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని, వృద్ధి తగ్గిపోతుంది’’అని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో చివరి త్రైమాసికంలో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందంటూ.. ప్రైవేటు వినియోగం, స్థిర పెట్టుబడులు ఇందుకు మద్దతునిచ్చినట్టు వివరించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనూ (ఏప్రిల్, మే) ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగానే కొనసాగుతున్నాయని ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో పెరిగినప్పటికీ, అది నియంత్రిత శ్రేణిలోనే ఉండడాన్ని గుర్తు చేసింది. విదేశీ వాణిజ్యం, చెల్లింపుల స్థితులు బలంగానే ఉన్నాయని వెల్లడించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), తగినంత విదేశీ మారకం నిల్వలు మద్దతుగా నిలిచినట్టు పేర్కొంది. ఎదుర్కొనే స్థితిలో.. ఇతర దేశాలతో పోల్చి చూస్తే.. బలమైన ఆర్థిక మూలాలతో భారత్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలవగలదని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఎల్పీజీ ధరలు పెంచినందున అది రెస్టారెంట్ల సేవలపై ప్రభావం చూపించి, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేసింది. జూన్ 18 నాటికి ఉన్న డేటా ప్రకారం ఆహార ధరల్లో పెరుగుదల కొనసాగుతున్నట్టు తెలిపింది. బియ్యం, గోధుమలు, ప్రధాన పప్పుల ధరలు పెరిగినట్టు వెల్లడించింది. అలాగే, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా, నూనెల ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలతో భారత క్రూడ్ బాస్కెట్ ధరలు గరిష్టాల్లోనే ఉన్నట్టు పేర్కొంది. -
ముఖం చాటేసిన నైరుతి
వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు. మధ్య భారతంలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తీవ్రమవుతున్న నీటి సమస్య ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ మే నెలలోనే ప్రకటించింది. చెన్నై చేరిన నీళ్ల రైలు చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. దక్షిణ మెట్రోపోలీస్ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే. -
ద్వితీయార్థంలో పసిడి
న్యూఢిల్లీ: బలహీనమైన రుతుపవనాలు గ్రామీణ ప్రాంతాల్లో బంగారానికి డిమాండ్‌పై ప్రభావం చూపినప్పటికీ మొత్తమ్మీద మెరుగైన సెంటిమెంట్ కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థం(జూలై - డిసెంబరు)లో పసిడికి పూర్వవైభవం వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. ‘ఈ ఏడాది ప్రథమార్థంలో 80:20 ఫార్ములా (దిగుమతుల్లో 20 శాతాన్ని ఎగుమతి చేయాలనే నిబంధన) పుత్తడి డిమాండ్‌పై ప్రభావం చూపింది. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తారనీ, 10 గ్రాముల ధర మళ్లీ రూ.25 వేల స్థాయికి వస్తుందనీ ప్రజలు భావించారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల ప్రభావం కూడా డిమాండ్‌పై పడింది...’ అని డబ్యూజీసీ ఎండీ పి.ఆర్.సోమసుందరం చెప్పారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేల శ్రేణిలో ఉంది. గతేడాది ఏప్రిల్‌లో రూ.26,440గా ఉన్న ధర ఆగస్టులో రూ.34,600కు చేరింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయిపోయింది కాబట్టి దిగుమతి సుంకం తగ్గింపు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని సోమసుందరం తెలిపారు. -
గ్రామీణ భారతంలో పసిడికి తగ్గనున్న డిమాండ్
న్యూఢిల్లీ: గ్రామీణ భారతంలో ఈ ఏడాది పసిడికి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండనుంది. వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండటం.. పొదుపుపై ప్రతికూల ప్రభావం చూపనుండటమే ఇందుకు కారణం. అయితే, దీపావళి పండుగ సమయంలో మాత్రం బంగారానికి డిమాండ్ కాస్త మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వం పుత్తడి దిగుమతులపై ఆంక్షలెన్ని పెట్టినప్పటికీ దీర్ఘకాలిక డిమాండ్ స్థిరంగానే ఉండనుంది. గురువారం అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) భారత విభాగం ఎండీ సోమసుందరం ఈ విషయాలు తెలిపారు. పసిడికి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, అక్కడి రైతు కుటుంబాల నుంచే డిమాం డ్ ఉంటోంది. సాధారణంగా గ్రామీణ కుటుంబాలు తాము చేసే పొదుపులో సుమారు 7-8% మొత్తాన్ని బంగారం కొనేందుకు ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం వర్షపాతం మళ్లీ మెరుగయ్యేలా ఉన్నప్పటికీ.. గ్రామీణ కుటుంబాల పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం .. బంగారం డిమాండ్‌పై కూడా పడే అవకాశాలు ఉన్నాయని సోమసుందరం తెలిపారు. గతేడాది దేశీయంగా 974 టన్నులుగా ఉన్న పసిడి డిమాండ్ ఈ ఏడాది 850-950 టన్నులకు తగ్గొచ్చని పేర్కొన్నారు. పసిడి దిగుమతులపై ఆంక్షలను సడలించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. మరోవైపు, హాల్‌మార్క్ ఆభరణాలకు విశిష్ట గుర్తింపు సంఖ్య(యూఐఎన్) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డెరైక్టర్ జనరల్ సునీల్ సోని తెలిపారు. కొనుగోలుదారు మోసపోయిన పక్షంలో సదరు ఆభరణాన్ని తయారుచేసినవారిని, హాల్‌మార్కింగ్ చేసిన వారిని పట్టుకునేందుకు దీనివల్ల వీలవుతుందన్నారు.


