మాస్కోతో దోస్తీ.. భారత్‌పైనా ట్రంప్‌ గురి! | India in Trumps Crosshairs: 500 Pecent Tariff Threat Over Russian Oil | Sakshi
Sakshi News home page

మాస్కోతో దోస్తీ.. భారత్‌పైనా ట్రంప్‌ గురి!

Jul 15 2026 6:43 AM | Updated on Jul 15 2026 6:59 AM

India in Trumps Crosshairs: 500 Pecent Tariff Threat Over Russian Oil

రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మరోసారి గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటివరకు కొన్ని వెసులుబాట్లతో కొనసాగిన పరిస్థితులకు తెరదించేలా.. రష్యా ఇంధన రంగంతో వ్యాపారాలు కొనసాగించే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే మిత్రదేశం భారత్‌కు షాక్‌ ఇస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దానికి పూర్తి మద్దతు తెలిపినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది.

రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు ప్రకటించినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని ఏఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీ అధికారికంగా ధృవీకరించింది. ‘సాంక్షనింగ్‌ రష్యా యాక్ట్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. రష్యా ఇంధన రంగంతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ సుంకాలు విధించే అధికారం లభిస్తుంది. ఈ బిల్లులో భాగంగా దిగుమతులపై గరిష్ఠంగా 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.

టార్గెట్‌లో భారత్‌, చైనా
ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లిన రిపబ్లికన్‌ నేత లిండ్సే గ్రాహమ్‌ గతంలోనే భారత్‌, చైనాలను ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురు, గ్యాస్‌ ఆదాయాలకు ఈ రెండు దేశాలే కీలక ఆధారాలని ఆయన వాదించారు. భారత్‌, చైనా కలిసి రష్యా ఇంధన ఎగుమతుల్లో భారీ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంటూ.. ఈ డిమాండ్‌ను తగ్గించడం ద్వారా మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు బలమైన మద్దతుదారుగా ఉన్న గ్రాహమ్‌.. ఇటీవల ఉక్రెయిన్‌ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన అనంతరం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని పలువురు సెనేటర్లు భావిస్తున్నారు.

భారత్‌కు ఎందుకు ఆందోళన?
ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న ముడిచమురు భారత్‌కు కీలకంగా మారింది. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నామని భారత్‌ స్పష్టం చేస్తోంది. అయితే అమెరికా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే.. భారత్‌ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫార్మా, టెక్స్‌టైల్స్‌, ఐటీ సేవలు రంగాలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని అంచనా. 500 శాతం టారిఫ్‌లు అమలైతే భారత ఆర్థిక వృద్ధి దాదాపు 0.5 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.

ఒకవైపు ముప్పు.. మరోవైపు వాణిజ్య అవకాశం
రష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే.. భారత్‌ మరో కీలక వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్తోంది. భారత్‌-బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీనితో భారత ఎగుమతిదారులకు బ్రిటన్‌ మార్కెట్‌లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు రష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి.. మరోవైపు కొత్త వాణిజ్య భాగస్వామ్యాలతో అవకాశాలు.. ప్రస్తుతం భారత్‌ దౌత్య, ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.

చమురు కోసం స్నేహమా? ఆర్థిక భద్రతా?
భారత్‌ మాత్రం తన వైఖరిలో మార్పు లేదని మొదటి నుంచి చెబుతోంది. ఇంధన దిగుమతులు దేశ ఆర్థిక అవసరాల ఆధారంగా జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వివరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు సెనేటర్లు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇది అవసరమని చెబుతుండగా.. మరికొందరు భారత్‌, చైనా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇక ముందు ఏం జరుగుతుంది?
ట్రంప్‌ మద్దతుతో ఈ బిల్లుకు మరింత ఊపు వచ్చినప్పటికీ.. ఇది చట్టంగా మారాలంటే కాంగ్రెస్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. రష్యాతో భారత్‌ ఇంధన సంబంధాలు మాత్రమే కాదు.. భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోళ్లు.. ఇప్పుడు భారత్‌కు ఆర్థిక లాభమా? లేక అమెరికా టారిఫ్‌ల రూపంలో కొత్త సవాలా? అన్నది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక చర్చగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement