అగ్రరాజ్యం అమెరికా ఏకాకి అవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆర్థికంగా గుదిబండలవుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అంటున్నారు జాన్ ఫైనర్. న్యూయార్క్‌టైమ్స్ పత్రికలో ఈయన రాసిన కథనం ప్రకారం అధ్యక్షుడి తెంపరితనం కాస్తా పౌరులకు వందల కోట్ల డాలర్ల నష్టం తీసుకొచ్చింది. మిత్రదేశాలనూ వదలకుండా చేస్తున్న హెచ్చరికలు అంతర్జాతీయంగా అమెరికా ఒంటరయ్యేందుకు కారణమవుతోందని విశ్లేషిస్తున్నారు.అధ్యక్షుడిగానే కాదు.. అంతకుముందు కూడా డొనాల్డ్ జే ట్రంప్ వైఖరి వివాదాస్పదమే.
ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం కావచ్చు. వివాహం, అక్రమసంబంధాలు, పన్నులు ఎగ్గొట్టడం.. ఇలా బోలెడన్నిసార్లు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తరువాత ఈ వివాదాల జోరు మరింత పెరిగిందేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(మాగా) నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించాక అక్రమ వలసదారులు, టారిఫ్‌లు, వీసాల వంటి విషయాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలుమార్లు విమర్శలకు గురయ్యాయి.
ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ జాన్ ఫైనర్ ఈ తెంపరి నిర్ణయాల తాలూకూ ఆర్థిక భారంపై వివరణాత్మక విశ్లేషణ ఒకటి చేశారు. దాని ప్రకారం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ఇప్పటికే పెట్రోలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సుమారు 15 శాతం వరకూ పెరగ్గా, యూరియా ధర ఏకంగా యాభై శాతం ఎక్కువైంది. డీఏపీ కోసం 27 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ పెంపు కాస్తా అమెరికన్లపై ఇప్పటికే సుమారు 13,200 కోట్ల డాలర్ల ఆర్థిక భారం మోపిందని అంచనా.
తగ్గిన పర్యాటకులు, విద్యార్థులు...
కఠిన వీసా నిబంధనలు అమలు చేయడం, యుద్ధభయం వంటి కారణాలతో అమెరికాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025లో అమెరికాకు వచ్చిన పర్యాటకుల సంఖ్య సుమారు 40 లక్షలు తక్కువ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు 800 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని లెక్కలేస్తున్నారు. వీసాల విషయంలో తీసుకొస్తున్న మార్పుల కారణంగా భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల విద్యార్థులు అమెరికాకు కాకుండా ఇతర యూరోపియన్ దేశాలకు మళ్లుతూండటం గమనార్హం. ఫలితంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు 2024తో పోలిస్తే 2025లో 17 శాతం తక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2026కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కాలేదు కానీ ఈ ఏడాది తగ్గుదల సుమారు 10 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. ఫలితంగా ఏటా కనీసం వంద కోట్ల డాలర్ల నష్టం ఉండొచ్చని తెలుస్తోంది.
యూరప్‌తో మిలటరీ సంబంధాలు
రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనే అమెరికా, నాటోల మధ్య విపరీతమైన అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. ట్రంప్ ఒంటెత్తు పోకడను పలు దేశాలు బహిరంగంగానే విమర్శించాయి. దీని ఫలితం సుస్పష్టం. 2025లో యూరోపియన్ దేశాలు మిలటరీపై పెట్టిన ఖర్చులు 14 శాతం వరకూ అంటే సుమారు 86,400 కోట్ల డాలర్లకు చేరినా అమెరికా కంపెనీల నుంచి చేసిన కొనుగోళ్లు సగానికి తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికా పొరుగున ఉన్న కెనడా 15,000 కోట్ల డాలర్లతో యూరోపియన్ డిఫెన్స్ ఫండ్‌లోకి చేరిపోయింది.
చైనాతో తన సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. ఆసియా దేశాల్లో జపాన్ తన మిలటరీ సామర్థ్యాన్ని పదును పెట్టుకుంటోంది. ఇందులో అమెరికా కంపెనీల స్థానంలో దక్షిణ కొరియా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. భారత్ కూడా ఏఐ వంటి కీలక టెక్నాలజీల విషయంలో దేశీ కంపెనీలు లేదంటే చైనీస్ కంపెనీల్లో మెరుగైన వాటిని వెతుక్కుంటున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమెరికాకు దూరంగా జరుగుతున్నట్లు, ఇందుకు ట్రంప్ తీరు, అమెరికా ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, వాణిజ్య వైరాలు, కృత్రిమ మేధ విషయంలో అస్పష్ట వైఖరి, విధానాలు కారణమని కాలమిస్ట్ ఫైనర్ విశ్లేషించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


