పోపుల డబ్బా ఆర్థిక వ్యవస్థ | Rural Sector Policy And The Indian Economy | Sakshi
Sakshi News home page

పోపుల డబ్బా ఆర్థిక వ్యవస్థ

Jul 6 2026 9:06 AM | Updated on Jul 6 2026 9:09 AM

Rural Sector Policy And The Indian Economy

భారతీయ గ్రామీణ సమాజ చరిత్రలో ‘పోపుల డబ్బా’ అనేది కేవలం ఒక చిన్న డబ్బా కాదు. అది ఒక కుటుంబ ఆర్థిక క్రమశిక్షణకు, మహిళల దూరదృష్టికి, భవిష్యత్‌ భద్రతకు, స్వయం ఆధారిత జీవన విధానానికి ప్రతీక. ఇటీవలివరకూ గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది కుటుంబాలు తమ దైనందిన జీవితంలో ఈ చిన్న డబ్బాను ఒక సూక్ష్మ బ్యాంకుగా ఉపయోగించేవి. ప్రజల జీవన అనుభవం, అవసరం, కష్టకాలాల నుంచి నేర్చుకున్న జ్ఞానం కలగలిపి ఏర్పడిన ఒక సహజమైన ఆర్థిక విధానం ఇది.

గ్రామీణ కుటుంబాల్లో సంపాదన ప్రధానంగా వ్యవసాయం, కూలి, పశుపోషణ, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు వంటి రంగా లపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆదాయం కూడా నెలనెలా స్థిరంగా కాకుండా కాలానుగుణంగా లభించేది. పంట అమ్మినప్పుడు మాత్రమే ఎక్కువ డబ్బు చేతికి వచ్చేది. మిగిలిన కాలంలో చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే గ్రామీణ మహిళలు ఇంటి ఖర్చులలో మిగిలిన చిల్లరను వృథా చేయకుండా పోపుల డబ్బాలో వేయడం అలవాటు చేసుకున్నారు. ఏడాది చివరికి అది కుటుంబానికి ఒక అత్యవసర నిధిగా మారేది.

ఇంటికి వచ్చిన ప్రతి రూపాయి ఎలా ఖర్చు చేయాలి, ఏ అవసరానికి ఎంత కేటాయించాలి, ఎంత పొదుపు చేయాలి అనే విషయాల్లో మహిళలు అసాధారణమైన లెక్కలు వేసేవారు. కుటుంబంలో ఇతరులకు తెలియకుండా కాదు, కుటుంబ ప్రయోజనాల కోసమే ఈ పొదుపు నిర్వహించబడేది. అనారోగ్యం వచ్చినప్పుడు, పిల్లల పాఠశాల ఫీజు చెల్లించాల్సి వచ్చినప్పుడు, పంట విత్తనాలు కొనాల్సినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు లేదా ఆకస్మిక ఖర్చులు ఎదురైనప్పుడు ముందుగా తెరవబడేది ఈ పోపుల డబ్బానే.

నేటి భాషలో దీనిని ‘మైక్రో ఎమర్జెన్సీ ఫండ్‌’ అని పిలిచినా, మన గ్రామీణ సమాజం దానిని దశాబ్దాల క్రితమే ఆచరణలో పెట్టింది. సామాజిక కోణంలో పరిశీలిస్తే పోపుల డబ్బా మహిళల నాయకత్వాన్ని కూడా బలపరిచింది. కుటుంబంలో ఖర్చుపై నియంత్రణ, అవసరాల ప్రాధాన్యత నిర్ణయించడం, అనవసర వ్యయా లను తగ్గించడం, పిల్లల్లో పొదుపు అలవాటు పెంపొందించడం వంటి బాధ్యతలను మహిళలు సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న పిల్లలకు కూడా మిగిలిన నాణేలను పోపుల డబ్బాలో వేయమని చెప్పడం ద్వారా చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణను నేర్పించేవారు. ఈ ప్రక్రియ వల్ల కుటుంబంలో ప్రతి రూపాయి విలువ తెలిసే సంస్కృతి ఏర్పడింది.

నేటి ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం చెప్పే ‘చిన్న అలవాట్లు పెద్ద ఆర్థిక విజయాలకు దారి తీస్తాయి’ అనే సిద్ధాంతాన్ని మన గ్రామీణ సమాజం ఎంతో కాలం క్రితమే జీవన విధానంగా స్వీకరించింది. పోపుల డబ్బా కేవలం గత తరాల జ్ఞాపకం కాదు; ఒక విలువైన సామాజిక సంపద. నేటి డిజిటల్‌ యుగంలో బ్యాంకింగ్‌ సేవలు విస్తరించినా, పోపుల డబ్బా వెనుక ఉన్న విలువలు – పొదుపు, మితవ్యయం, భవిష్యత్‌ ప్రణాళిక, కుటుంబ బాధ్యత, ఆర్థిక స్వయం సమృద్ధి– ఎప్పటికీ ప్రాసంగికమే. – డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, పౌర సంబంధాల అధికారి, ఆర్ట్స్‌ కళాశాల, కేయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement