అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మిస్తాం
ట్రాఫిక్ నియంత్రణకు రహదారుల విస్తరణ ఒక్కటే సరిపోదు..
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు విప్లవాత్మక నిర్ణయమని కమిటీ కితాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రహదారుల విస్తరణ ఒక్కటే సరిపోదని, బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుందన్నారు. పెరుగుతున్న నగరీకరణతో సమీప భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రాంతం మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. ‘హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగ రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ వంటి మూడు విధానాల్లో సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం’అని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నట్లు వివరించారు. నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే మొదటిది: స్టాండింగ్ కమిటీ
స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు ఇతర సభ్యులు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై కమిటీ ముఖ్యమంత్రిని అభినందించింది. దీంతోపాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడింది. అంతకుముందు స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులను ముఖ్యమంత్రి సత్కరించారు. తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్‌ను కమిటీ సభ్యులకు అందజేశారు. సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


