క్యూ1లో రూ. 3,649 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ప్రైవేటు పోర్ట్స్ దిగ్గజం అదానీ పోర్ట్స్ (ఏపీసెజ్) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. అంతర్జాతీయ పోర్టుల, మెరైన బిజినెస్‌ల జోరు, దేశీ పోర్టుల స్థిరమైన పనితీరుతో ఈ ఏడాది తొలి త్రైమాసికం (2026–26, క్యూ1)లో కంపెనీ రూ. 3,650 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.3,311 కోట్లతో పోలిస్తే లాభం 10.23 శాతం జంప్ చేసింది.
మొత్తం ఆదాయం కూడా 24 శాతం వృద్ధితో రూ. 9,422 కోట్ల నుంచి రూ. 11,674 కోట్లకు ఎగబాకింది. మరోపక్క, కంపెనీ వ్యయాలు రూ.5,732 కోట్ల నుంచి రూ. 7,079 కోట్లకు పెరగడం గమనార్హం. ‘అన్ని వ్యాపార విభాగాల్లో ఈ సమతుల్యమైన వృద్ధితో 2031 నాటికి కంపెనీ లక్ష్యాలను సాధించగలమన్న నమ్మకం మరింత బలపడింది.
2030 కల్లా దేశీ పోర్టుల హ్యాడ్లింగ్ సామర్థ్యాన్ని 1,000 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ)కు విస్తరించాలన్న టార్గెట్, అంతర్జాతీయ పోర్ట్ట్‌ఫోలియో వృద్ధి, వేగంగా విస్తరిస్తున్న లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ దన్నుతో దీర్ఘకాలిక విలువను సృష్టించే సామర్థ్యం గల మరింత వైవిధ్యమైన, స్థిరమైన, ప్రపంచవ్యాప్తంగా అనువైన రవాణా ప్లాట్‌ఫామ్‌ను ఎపీసెజ్ నెలకొల్పుతోంది’ అని కంపెనీ సీఈఓ అశ్వని గుప్తా పేర్కొన్నారు.
క్యూ1లో అంతర్జాతీయ పోర్టుల నుంచి ఆదాయం 256 శాతం దూసుకెళ్లి రూ. 1,747 కోట్లకు చేరింది. దేశీ పోర్టుల ఆదాయం 12 శాతం వృద్ధి చెందింది. ఇక మెరైన్ వ్యాపార ఆదాయం 67 శాతం ఎగసి రూ. 901 కోట్లను తాకింది. కొత్త ఆఫ్‌షోర్ వెసల్స్ జోడింపు, యూరోపియన్ సబ్‌సీ విస్తరణ దీనికి దోహదం చేశాయి. కాగా, 2026–27 పూర్తి ఏడాదికి అదానీ పోర్ట్స్ రూ. 43,000–45,000 కోట్ల ఆదాయాన్ని, రూ. 25,000–26,000 కోట్ల ఎబిటాను అంచనా వేస్తోంది. జూన్ నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ. 56,776 కోట్లు కాగా, రూ. 12,428 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.
ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు 3 శాతం క్షీణించి రూ. 1,721 వద్ద ముగిసింది.


