breaking news
gsl medical college
-
బడా బాబులైనా శిక్ష పడాల్సిందే...
‘‘ఒక్కరోజులో మా భవిష్యత్తు కళ్లెదుటనే కుప్పకూలిపోయింది. డాక్టరుగా పుట్టిన గడ్డకు ఎంతో సేవ చేయాలని తపించిన మా కూతురిని మాకు లేకుండా చేశారు. తప్పతాగి .. రోడ్ల మీదకు వచ్చి, ఇతరుల బిడ్డలను పొట్టన పెట్టుకోకండి..’’ అంటూ పుట్టెడు దుఃఖంతో వేడుకుంటున్నారు డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్, చంద్రమ్మ. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంక, మూడు రోజుల క్రితం మద్యం మత్తులో కారుతో ఉన్మాదులు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, చేసిన వీరంగానికి బలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాల్ జిల్లా అయిజ మండంలోని ఎక్లాస్పురంలో పుట్టి పెరిగిన పెరిగింది ప్రియాంక. దోషులకు శిక్ష పడాలని, సమాజంలో మార్పు రావాలని, ప్రభుత్వాలు తమ బిడ్డకు న్యాయం చేయాలని వెంకటేశ్, చంద్రమ్మలు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు..చదువులో టాపర్‌గా ఉండే ప్రియాంక మెడిసిన్‌లో ర్యాంకు తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించింది.. మరికొన్నాళ్లలో పీజీ పూర్తి చేసి, వైద్యరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ‘‘కానీ ఆ కలలను కొందరు దుర్మార్గులు గద్దల్లా ఎత్తుకుపోయారు. మా అమ్మాయి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్ని చేసినా మా అమ్మాయి తిరిగి రాదు. కానీ, వాళ్లను శిక్షిస్తేనే మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. ఉన్న ఊరును వదిలి, అయినవారందకీ దూరంగా పిల్లల చదువుల కోసం శ్రమిస్తాం. ఎంతో కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నాం. కానీ, కొందరు తమ తండ్రులకు, కుటుంబాలకు పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచనల్లో ఉంటారు. తాగినవాళ్లు ఇంటిదగ్గర ఉండకుండా బయట పెద్ద పెద్ద కార్లు వేసుకొని షికార్లు చేస్తారు. డబ్బు, హోదా ఉందనే పొగరు, సంపన్నులకు శిక్షలు ఉండవనే ధైర్యం వారిది. రాజకీయ పలుకుబడి ఉందనే ధీమా వారిది. కొవ్వెక్కి చేసిన పనులకు తగిన శిక్ష పడాలి. ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు. దోషులను కఠినంగా శిక్షించి, ఉరి తీయందే మా కడుపు మంట చల్లారదు’ అని తెలిపారు చంద్రమ్మ.చట్టపరంగా శిక్షించాల్సిందే..! వెంకటేష్ మాట్లాడుతూ –‘‘దోషులకు మరణ శిక్ష పడాల్సిందే. ఇలాంటి శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో భయం అనేది ఉంటుంది. అప్పుడే మాలాంటి తల్లిదండ్రుల కడుపుకోతలు, ఆర్తనాదాలు ఉండవు. ఇంకా ఎంతమందికి ఇలాంటివి జరుగుతాయో. దోషులకు సరైన శిక్ష పడకపోతే ‘మేం ఏం చేసినా చెల్లుతుంది’ అని తేలిక భావనతో ఉంటారు. ఇలాంటి పోకిరీగాళ్లు ‘మాకు ఏమవుతుందిలే, మా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది’ అనుకుంటారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తే భయం ఉంటుంది. ఇలాంటి దోషులకు మరణశిక్ష , యావజ్జీవ కారాగార శిక్ష పడితేనే సమాజంలో కూడా మార్పు వస్తుంది. శిక్షలు కరెక్ట్‌గా అమలు అవ్వాలి. రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తాం అని పోలీసులు చెప్పారు. ప్రజలు కూడా ఇలాంటి అన్యాయాలు జరగడం సరికాదని పదే పదే చెబుతున్నారు. కరెక్ట్‌గా శిక్షలు పడితే సరే, లేదంటే మా గొంతు, మా కడుపుకోత, మా బాధ రాజమండ్రి వేదికగా పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరగకపోతే మా ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతూనే ఉంటాం. మాలాంటి ఎంతోమంది తల్లిదండ్రల మద్దతుతో అందరి ముం దుకు వస్తాం’’ అన్నారు వెంకటేష్.తీరని లోటు...తల్లితండ్రులు ఇద్దరూ తమ కూతురు గురించి వివరిస్తూ –‘‘మా ప్రియాంక ఎవరినీ నొప్పించేది కాదు. అందరితో కలివిడిగా ఉండేది. తొందరపడి ఎవరినీ ఎమీ అనేది కాదు. ప్రాపర్‌గా పనులు జరగాలి. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉండేది. మా ఊరు నుంచి కానీ, మా కుటుంబంలో కానీ ఎవరూ డాక్టర్లు లేరు. అలాంటిది ప్రియాంక డాక్టర్ అయి ఆ పేరు నేను నిలబెడతా అనేది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పీజీ సీటు కూడా మంచి ర్యాంకుతో తెచ్చుకుంది. ఎక్కడా ఒక్క రిమార్క్ లేదు. చదువు చక్కగా సాగుతున్న సమయంలో, మరో రెండేళ్లలో స్పెషలిస్ట్‌గా బయటకు వచ్చేది. ఇలాంటి సమయంలో ఇలాంటి దారుణం జరిగింది. మా జీవితాంతం తీరని లోటు మిగిలింది. మాకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిసినా ఊరుకోం. మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా మా బిడ్డకు ఆత్మ శాంతి కలిగిస్తాం’’ అని తమ ఆవేదనను, ఆవేశాన్ని మన ముందు ఉంచారు వెంకటేష్, చంద్రమ్మలు. ఏ మాత్రం సహించం..మా కమ్యూనిటీలోనే డాక్టర్లు ఎవరూ లేరు. అమ్మాయిలను చదివించడం అనేది ఇప్పటి వరకు మా దగ్గర ఏ కుటుంబంలోనూ 28 ఏళ్లుగా లేదు. ఇరవై ఏళ్లు రాగానే పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేస్తారు. అలాంటిది ప్రియాంకకు చదువు మీద ఉన్న శ్రద్ధతో ఆమె కలకే ప్రాముఖ్యం ఇచ్చాం. తను మా ఊరుకు పెళ్లి చూపులకని వచ్చి, తిరిగి కాలేజీకి వెళ్లిపోయింది. ఇంకో ఆర్నెల్లలో పెళ్లి అవుతుందని, అమ్మాయి జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాం. ఊరు నుంచి వెళ్లిన ఒక్కరోజులోనే.. ‘మీ అమ్మాయి ప్రియాంకకు యాక్సిడెంట్ అయ్యింది, తీవ్ర రక్త స్రావం అవుతోంది’ అని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. ఇన్నాళ్లూ తను పడిన కష్టానికి తగిన ఫలితం రాకుండానే దుర్మార్గులు మాకు దూరం చేశారు. తనకు సరైన న్యాయం జరగకపోతే ఏ మాత్రం సహించం. – చంద్రమ్మ, ప్రియాంక తల్లి– నిర్మలారెడ్డి, ఇన్పుట్స్ వాగు గడ్డ నరసింహారెడ్డి, సాక్షి, గద్వాల్ -
ప్రారంభమైన మొబైల్ థియేటర్
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలకు సమీపాన హెబిటేట్ రెస్టారెంట్ పక్కన ఏర్పాటు చేసిన మొబైల్ థియేటర్ ప్రారంభమైంది. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సోమవారం దీనిని ప్రారంభించారు. ‘పిక్చర్ టైమ్’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ థియేటర్ గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్‌లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులలో ఒకరైన చైతన్య తెలిపారు. ఇన్‌ఫ్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ (గాలి నింపిన టెంట్)తో తయారైన ఈ థియేటర్ అన్ని వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందన్నారు. 35 ఎంఎం స్క్రీన్‌తో, 120 సిటింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌కి ఏడాది పాటు అనుమతులున్నాయని, ఈనెల 29న విడుదలయ్యే ఆచార్య సినిమాతో రెగ్యులర్ షోలు వేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌తోపాటు బుకింగ్ కౌంటర్‌లోను లభించే టికెట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జీఎస్ఎల్ ప్రతినిధులు డాక్టర్ గన్ని సందీప్, డాక్టర్ జి. తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ భవనంపై నుంచి దూకి..
రాజమహేంద్రవరం: జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజి హాస్టల్ లో ఉంటున్న శుభ శ్రీ(21) ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతోంది. కొంతకాలంగా శుభను నలుగురు విద్యార్థులు వేధిస్తున్నట్లు ఆమె ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ర్యాగింగ్ పై కాలేజి కమిటీని కూడా నియమించినట్లు తెలిపారు. వేధింపుల కారణంగా శుభ కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతోందని చెప్పారు. గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్యయత్నాలు చేసినట్లు యాజమాన్యం చెప్పినట్లు తెలిపారు. శుభశ్రీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెల్లవారేదాకా ఎవరూ గమనించలేదని తెలిపారు. గురువారం వేకువజామున తోటి వారు ఆమె చనిపోయి ఉండటాన్ని గుర్తించినట్లు చెప్పారు. -
ర్యాగింగ్ వల్లే వైద్యవిద్యార్థిని ఆత్మహత్య?
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజి విద్యార్థిని శుభశ్రీ (21) ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజానగరంలోని మెడికల్ కాలేజి హాస్టల్ లో ఉంటున్న శుభ శ్రీ(21) ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వాస్తవానికి నలుగురు విద్యార్థులు తనను ర్యాగింగ్ చేస్తున్నారని రెండు వారాల క్రితం శుభశ్రీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ కమిటీని నియమించినట్లు కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే.. శుభశ్రీ కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతోందని, ఇంతకు ముందు కూడా రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తెలిపింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జీఎస్ఎల్ వైద్య కళాశాలలో పనిచేసే కె.సత్యనారాయణ (55) విధులు ముగిసిన తర్వాత సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జీఎస్ఎల్ వైద్య కళాశాల ముందే చోటు చేసుకుంది. -
కాకినాడలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైద్య విద్యార్థి శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక గాంధీనగర్‌లోని తన ఇంట్లో శ్రీలక్ష్మి అత్యహత్యకు పాల్పడింది. రాజమండ్రిలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో శ్రీలక్ష్మి రేడియాలజీ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే కాలేజీ యజమాన్య వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రీలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శ్రీలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీలక్ష్మి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


