ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక

- - Sakshi

ఆదాయం, లోకల్‌ సర్టిఫికెట్లు అవసరం లేదు

ప్రజాపాలన దరఖాస్తుల సందేహాలపై కలెక్టర్‌ స్పష్టత

భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్‌ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్‌ కార్డులో ఆంధ్రప్రదేశ్‌, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు.

సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్‌ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్‌ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్‌ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్‌ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్‌ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు.

ఇవి చ‌ద‌వండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top