● ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ● ముగిసిన సీపీఐ శిక్షణా తరగతులు
పాల్వంచ: కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ఎల్లప్పు డూ ప్రజల పక్షానే పనిచేయాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. పాల్వంచలో నిర్వహిస్తున్న సీపీఐ ప్రజా ప్రతినిధుల రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు శనివారం ముగిశాయి. తరగతుల్లో ‘ప్రజా ప్రతినిధులుగా కమ్యూనిస్టుల పాత్ర’ అనే అంశంపై నాగేశ్వర్ మాట్లాడారు. కమ్యూనిస్టులతోనే మెరుగైన పాలన సాధ్యమని, నూతనంగా ప్రజా ప్రతినిధులు సుపరిపాలన దిశగా అడుగులు వేయాలని అన్నారు. యూపీఏ–1 ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కలిసి ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి ప్రజా ప్రయోజన చట్టాలు అమల్లోకి వచ్చాయన్నా రు. యూపీఏ–2 ప్రభుత్వం నుంచి కమ్యూనిస్టులు వైదొలగడంతో అన్నీ కుంభకోణాలే జరిగాయని అన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూసి శ్రీధర్ మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడటంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. పాలకులు సమాచారహక్కు చట్టా న్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలతో మమేకం కావాలి
జనం మన్ననలు పొందగలిగిన వారే నిజమైన నాయకులు అని.. అందుకోసం కమ్యూనిస్టులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. కమ్యూనిస్టు నాయకులకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని తెలిపారు. పదవులే కావాలనుకుంటే జ్యోతిబసు లాంటి యోధులు ప్రధాని అయ్యే వారని, చండ్రా రాజేశ్వరరావు ఎమ్మెల్సీ పదవినీ సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేశారని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారని, ఐదు సార్లు గెలిచిన గుమ్మడి నర్సయ్య సాదాసీదా జీవనం సాగిస్తున్నారని, రజబ్ అలీ వంటి మేధావులు కమ్యూనిజమే ఊపిరిగా బతికారని వెల్లడించారు. మీడియా అకాడమీ చైర్మ న్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. సీపీఐ నేత రామకృష్ణ, మేయర్ మూడ్ గణేష్, నాయకులు పశ్య పద్మ, సృజన్, ఎస్‌కె.సాబీర్‌పాషా, వెంకటేశ్వరరావు, విశ్వనాథం, భిక్షపతి, అజయ్, మునిగడప పద్మ, ఉమా, మురళి పాల్గొన్నారు.


