ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్‌గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే పార్ట్‌లో చూపించలేక.. రెండో భాగం తెరకెక్కిస్తుంటే..మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్‌ని ప్రకటిస్తున్నారు. కథ రేడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్ ప్రకటిస్తారు. సినిమా హిట్ అయితే..అప్పడు కథని డెవలప్ చేస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే.. సీక్వెల్ ప్రకటించినప్పటికీ..మళ్లీ దాని జోలికి వెళ్లరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్ ప్రకటించడం మాత్రం ఆగడం లేదు.
చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’కి కూడా సీక్వెల్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్ లేదని స్పష్టం చేశారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు సాహు, సుస్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మన శంకర్ వరప్రసాద్’కి సీక్వెల్ ఉంటుందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది కంప్లీట్ ఎండింగ్ మూవీ. క్లైమాక్స్‌లో పార్ట్ 2 ప్రకటన ఏమి ఉండదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని స్పష్టం చేశారు.
మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది.


