టాలీవుడ్‌లో ప్రతి సీజన్‌కి ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ఉంటుంది. ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వచ్చాయి. అంతకంటే ముందు ప్రేమకథలు హవాను కొనసాగించాయి. ఇటీవల వరకూ యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలు సిల్వర్ స్క్రీన్‌పై ఆధిపత్యం చెలాయించాయి.అయితే ఇప్పుడు పరిస్థితి మరోసారి మారుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలను గమనిస్తే ప్రేక్షకుల అభిరుచి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘రాజాసాబ్’ మినహా మిగతా అన్ని సినిమాల్లో ప్రధాన ఎలిమెంట్ కామెడీనే. మన శంకరవరప్రసాద్,అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసినవి కామెడీ పోర్షన్లే.
ఇది కేవలం సంక్రాంతి సినిమాల వరకే పరిమితమా? లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరో 2-3 కామెడీ సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ పూర్తిగా కామెడీ వైపు మలుపు తిరిగిందని చెప్పవచ్చు.
ఇప్పటివరకు ప్రేక్షకులు కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తారనే భావన ఉండేది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని అనుకునేవారు. ఆ విషయాన్ని పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు.
ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ఏడాది పైగా సమయం పడుతోంది. కానీ కామెడీ ట్రెండ్ బలపడితే మాత్రం ఇది శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరుగుతుంది. పాన్ ఇండియా హంగులు తగ్గుతాయి. నిర్మాతలకు భారీ బడ్జెట్‌ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. టాలీవుడ్‌లో కామెడీ చిత్రాల ట్రెండ్ మొదలైనట్లు సంక్రాంతి సినిమాలు సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ బలపడితే, ఇండస్ట్రీలో కొత్త మార్పులు తప్పవు.


