అమృతం సీరియల్‌తో బాగా ఫేమస్ అయిన వ్యక్తి హర్షవర్ధన్. నటుడిగానే కాకుండా డైలాగ్ రచయితగానూ సుపరిచితుడైన ఈయన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాది కోర్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా సహా ఐదారు సినిమాల్లో నటుడిగా అలరించిన ఆయన ఈ ఏడాది మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలోనూ మెప్పించాడు.
షూటింగ్ మధ్యలో యాక్సిడెంట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలవగా ఏకంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో హర్షవర్ధన్‌కు యాక్సిడెంట్ కూడా అయింది. దీంతో ఆస్పత్రి బెడ్‌పై నుంచే మిగతా సగం షూటింగ్ పూర్తి చేశాడు. తాజాగా ఈ సినిమాకుగానూ తనకు ఎంత పారితోషికం ముట్టిందనే విషయాన్ని బయటపెట్టాడు.
రెమ్యునరేషన్ ఎంత?
హర్షవర్దన్ మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ అనేది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి సినిమా మొత్తానికి కలిపి ప్యాకేజీ మాట్లాడుకోవడం.. రెండోది రోజుకు ఇంత అని లెక్కగట్టడం. ఈ సినిమాకు 60 రోజులు డేట్స్ ఇచ్చాను. రెండు నెలలు కాబట్టి రోజు లెక్కన పారితోషికం ఇవ్వరు. ప్యాకేజీ ఫిక్స్ చేశారు. అలా రూ.40 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం హర్షవర్దన్ చిరంజీవి విశ్వంభర సినిమలో యాక్ట్ చేస్తున్నాడు.


