తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉండే సీజన్ ఇది. అందుకే స్టార్ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్‌పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.
ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..
మన శంకర వర ప్రసాద్ గారు
రాజాసాబ్
భర్త మహాశయులకు విజ్ఞప్తి
అనగనగా ఒక రాజు
నారీ నారీ నడుమ మురారీ
జననాయగన్
పరాశక్తి
‘రాజాసాబ్’పై క్లారిటీ వచ్చేది
ఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.
రాజుగారు రావడం లేదా?
సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.
ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్‌లో ఆయన బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్ పోరులోకి రాబోతుంది.
చిరు క్లారిటీ ఇస్తే..
డేట్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అనిల్ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే.
వీటితో పాటు ఈ పొంగల్ పోరులో తమిళ్ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్-సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ పొంగల్ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


