టైటిల్ క్యాచీగా ఉంటే ఆడియన్స్ అటెన్షన్‌ని ఈజీగా క్యాచ్ చేస్తుంది... అది చిన్న టైటిలా? పెద్ద టైటిలా? అన్నది కాదు. అయితే ఒక్కోసారి రెండక్షరాలతోనే టైటిల్ కుదరొచ్చు... ఇరవై అక్షరాలతోనూ కుదరొచ్చు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ చూస్తే మాత్రం ‘పెద్ద’ టైటిల్ ట్రెండ్ సాగుతున్నట్లనిపిస్తోంది. ఆ లెంగ్తీ టైటిల్స్ అన్నీ అచ్చ తెలుగులో చక్కగా క్యాచీగా ఉన్నాయి. ఆ టైటిల్స్, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోలు, ఆ కథా కమామీషులోకి వెళదాం.
మన శంకరవరప్రసాద్‌గారు...
‘ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్, విశ్వంభర’ వంటి చిన్న టైటిల్స్ చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న పెద్ద టైటిల్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కావడం విశేషం. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్, శశిరేఖల ప్రేమకథ, కుటుంబ గాథల కహానీ ఏంటి? అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ (2019) చిత్రం తర్వాత చిరంజీవి–నయనతార జోడీగా నటిస్తున్న సినిమా ఇది (‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో అన్న, చెల్లెలుగా నటించారు). ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కేథరీన్ , సచిన్ ఖేడేకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార (శశిరేఖ), చిరంజీవి (వరప్రసాద్ పాత్రలో) భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెండితెరపై వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అన్నది ‘మీసాల పిల్ల...’ అనే పాటలో చూపించారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. అంతేకాదు... తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి–వెంకటేశ్ కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటస్తుండటంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి΄ాట ‘మీసాల పిల్ల...’, ద్వితీయ పాట ‘శశిరేఖ...’ ఏ స్థాయిలో శ్రోతలను అలరించాయో తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువస్తోంది.
ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47...
కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని., మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించడంలో వెంకటేశ్ దిట్ట. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు... కెరీర్‌లో తొలిసారి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సాధించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక– హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, ఈ నెల 10న ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
‘‘కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో రానున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా వెండితెరపై వినోదాల విందుని అందించనుంది. వెంకటేశ్–త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘నారప్ప, దశ్యం 2, ఎఫ్ 3, సైంధవ్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి షార్ట్ టైటిల్స్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న బిగ్ టైటిల్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి....
హీరో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ కెరీర్‌లో 76వ సినిమాగా రూ΄÷ందుతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామసత్యనారాయణ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో.. ‘‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్ జీపీటీ, జెమిని.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను.. ఆశ్చర్యపోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ పలికిన సంభాషణలకు మంచి స్పందన వచ్చింది.
‘‘చాలా రోజుల తర్వాత రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంది. అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు రవితేజ. కిషోర్ తిరుమల టచ్‌తో ఈ టైటిల్ ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించింది. మా సినిమా పక్కా ఎంటర్‌టైనింగ్‌గా, మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత హీరో రవితేజ–సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బెల్లా బెల్లా...’, ‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే...’ వంటి ΄ాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ‘ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ వంటి చిన్న టైటిల్స్ సినిమాల తర్వాత రవితేజ నటిస్తున్న పెద్ద టైటిల్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వీరి కలయికలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదల చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యేక ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ ΄ాటను భాస్కరభట్ల రాయగా, విశాల్ దడ్లానీ ΄ాడారు. ఇప్పటికే టాకీ ΄ార్ట్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నారీ నారీ నడుమ మురారి
బాలకృష్ణ హీరోగా శోభన, నిరోషా హీరోయిన్లుగా రూ΄÷ందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నరసింహ నాయుడు నిర్మించిన ఈ మూవీ 1990 ఏప్రిల్ 27న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజైన ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. ‘నారీ నారీ నడుమ మురారి’ పేరుతో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త, సాక్షీ వైద్య బావా మరదల్లుగా నటించారట. మరి... ఇద్దరు మరదల్లు కలిసి బావని ఎలా ఆటపట్టించారు? ఈ బావా–మరదల్లు వెండితెరపై చేసిన సందడి ఏ స్థాయిలో నవ్వులు పంచింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016’, ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగి హిట్స్ అందుకున్న శర్వానంద్, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో 2026 సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియ¯Œ ్సను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
అనగనగా ఒకరాజు
‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీ¯Œ ΄÷లిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా వినోదాత్మక చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూ΄÷ందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్రోమోస్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ప్రత్యేకించి సంక్రాంతి ప్రోమో అంటూ రిలీజ్ చేసిన నవీన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి కళ్లజోడు పెట్టుకుని పక్కా సంక్రాంతి బుల్లోడిలా ఉన్నారు నవీన్. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో జాయింట్ వీల్, భారీ ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆ పోస్టర్ పక్కాగా సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి నవంబరు 27న విడుదలైన ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే ΄ాటకి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేలా మా చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ప్రేక్షకులముందుకొస్తోంది.
ఓం శాంతి శాంతి శాంతి
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన నటుడిగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్–మూవీవెర్స్ స్టూడియోస్‌పై సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర పాత్రలు పోషించారు. మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని తొలుత ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ విడుదల వాయిదా పడింది.
2026 జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి ΄ాత్ర చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. అంబటి, ప్రశాంతిల పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఈ సమయంలో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది?’’ అనేది మా సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మా మూవీ ఆడియన్స్‌ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
ఆకాశంలో ఒక తార
‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. అంతేకాదు... మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు కథానాయకుడే అన్నట్లు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారాయన. మలయాళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళుతున్న ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం మంచి ఫ్యాన్ బేస్ సం΄ాదించుకున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జూలై 28న దుల్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌కి చక్కని స్పందన వచ్చినట్లు చిత్రబందం పేర్కొంది. దుల్కర్ సల్మాన్ ఓ సాధారణ రైతు ΄ాత్ర చేశారు. ఓ పల్లెటూరికి చెందిన ఆయన అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలని ఎలా నెరవేర్చుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని తెలుస్తోంది. ‘‘సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళుతున్న దుల్కర్ సల్మాన్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం మా సినిమాకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ టైటిల్స్ మాత్రమే కాదు... ఇంకా లెంగ్తీ టైటిల్ ఉన్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.
– డేరంగుల జగన్ మోహన్


