టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు.
అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?
శర్వా నమ్మకం అదే..
ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది.
సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా.
గత చరిత్ర ఏం చెబుతోంది?
గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.
ఈసారి అంత ఈజీకాదు.. !
అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.


