మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సిన అఖండ-2 కు ఊహించని షాక్ తగిలింది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్‌కి అనుమతించిన న్యాయస్థానం.. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది.
కాగా, ఇప్పటికే అఖండ 2(Akhanda 2 ) రిలీజ్ ఒకసారి వాయిదా పడింది. ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని సెటిల్ చేసుకొని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సతీష్ కమల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ప్రీమియర్స్‌ని రద్దు చేయడంతో పాటు టికెట్ల రేట్ల పెంపుకు ఇచ్చిన మోమోని సస్పెండ్ చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరికాసేపట్లో హైకోర్టు(Telangana High Court) దీనిపై విచారణ చేయనుంది. దీంతో ఇప్పుడు మరోసారి అఖండ 2 సినిమా హాట్ టాపిక్ అయింది. మరి ఈ విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
అఖండ 2 విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.


