టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చాలా సినిమాల్లో కనిపించారు. తెలుగు సినిమా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని ఆయన మనవడు జూనియర్. ఎస్వీ రంగారావు ప్రెస్‌మీట్ పెట్టి మరీ బయటపెట్టాడు. పోలీసులు కూడా తనని బెదిరిస్తున్నారని చెప్పి వ్యక్తం చేశాడు.
ఎస్వీ రంగారావు మనవడు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ శాంతి నగర్‌లో 1960ల్లో రంగారావు ఓ స్థలాన్ని కొనుగోలు చేసి భవంతి కట్టుకున్నారు. ఆయన తదనంతరం ఇది వారసులకు చెందింది. అయితే 1995లో శ్రీనివాస్ అనే వ్యక్తికి దీన్ని అద్దెకు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత సరిగా అద్దె కట్టకపోవడంతో రంగారావు కూతురు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో శ్రీనివాస్.. వెంటనే బిల్డింగ్‌ని ఖాళీ చేయడంతో పాటు ఇవ్వాల్సిన అద్దె కూడా చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.
(ఇదీ చదవండి: 'అన్నగారు' రావట్లేదు.. కార్తీ సినిమా మళ్లీ వాయిదా?)
ఈ విషయమై సదరు శ్రీనివాస్.. హైకోర్ట్‌ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత కాలంలో ఫోర్జరీ చేసి ఈ స్థలం తనదే అని వాదించసాగాడు. అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం సదరు స్థలంలో ఉన్న భవంతిని కూల్చి కొత్తగా బిల్డింగ్ కడుతున్నారని తెలిసి ఎస్వీ రంగారావు మనవడు మళ్లీ కోర్ట్‌ని ఆశ్రయించాడు. దీంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. అయినా సరే శ్రీనివాస్.. నిర్మాణ పనులు చేస్తున్నారని, దీని గురించి అడిగేందుకు వెళ్తే తనని బెదిరిస్తున్నాడని ఎస్వీ రంగారావు మనవడు చెప్పుకొచ్చాడు.
కొన్నిరోజుల క్రితం కూడా ఇదే విషయమై తనని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కి పిలిచారని, అక్కడికి వెళ్తే అడిషనల్ డీజీపీ సి.ఆనంద్.. తనని ఆ స్థలంలో అడుగుపెట్టడానికి వీల్లేదని అన్నారని ఎస్వీ రంగారావు మనవడు పేర్కొన్నాడు. మా తాత ఎస్వీ రంగారావు కొన్న భూమిని ఒక వ్యక్తి అక్రమంగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా మాపై బెదిరింపులకు దిగుతున్నాడని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని రంగారావు మనవడు ఆవేదన వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త: చిన్మయి)


