అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా ప్రీయయర్ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణహైకోర్టు సస్పెండ్ చేసింది. అఖండ-2 మూవీ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపు జీవోను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నిర్మాణ సంస్థకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ తాజా నిర్ణయంతో తెలంగాణలో ప్రీమియర్ షోలు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తాజాగా హైకోర్ట్ ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపును సస్పెండ్ చేసింది. దీంతో అఖండ-2 నిర్మాతలు ప్రీమియర్ షోలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆడియన్స్‌లో సస్పెన్స్ నెలకొంది.



