ఇప్పటి వరకు వెండితెరపై అభిమానులను నవ్వించిన టాలీవుడ్ నటి ప్రగతి(Pragathi) క్రీడల్లోనూ సత్తా చాటుతోంది. సినిమాలను పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ క్రీడాకారిణిగా మారిపోయింది. ఇటీవల పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా నాలుగు పతకాలు కైవసం చేసుకుంది. దీంతో టాలీవుడ్ మొత్తం ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తోంది. ఆమె టాలెంట్ను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
తాజాగా ప్రగతి తెలుగు వెబ్ సిరీస్ 3 రోజెస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆమె పంచుకున్నారు. ఎక్కడ ట్రోల్ చేస్తారోననే భయంతో తాను మీడియాకు దూరంగా ఉంటున్నానని ప్రగతి తెలిపారు. పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలామంది తనను ట్రోల్ చేశారని గుర్తు చేసుకున్నారు. జిమ్‌లో నా దుస్తులపై కూడా విమర్శలు వచ్చాయని అన్నారు. జిమ్కి చీరలు కట్టుకుని వెళ్లలేం కదా.. అందరూ అలా తిడుతుంటే చాలా బాధపడ్డానని తెలిపింది. నీకు ఈ వయసులో అవసరమా? అని చాలామంది అన్నారని ప్రగతి ఆవేదన వ్యక్తం చేసింది.
(ఇది చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్.. చాలా బాధపడ్డా!)
నాపై ఆ ట్రోల్స్ చూసి తప్పు చేస్తున్నానేమోనని భయపడ్డానని.. నా ఎదిగిన కూతురికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని బాధపడ్డానని ప్రగతి తెలిపింది. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగేశానని.. ట్రోల్స్ చేసిన వారికి పతకాలతోనే సమాధానం ఇచ్చానని ప్రగతి కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు నా పతకాలను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశానికి ఇంత మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉందని అన్నారు. తన నెక్ట్స్ మూవీ తమిళంలో చేస్తున్నానని ప్రగతి వెల్లడించారు.
ప్రగతి మాట్లాడుతూ..'నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ నేను సినిమాలు ఎప్పటికీ మానేయను. ఎందుకంటే నటించకపోతే నేను బతకలేను. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీనే. నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని ఎప్పటికీ వదిలుకోను. తుదిశ్వాస వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటా. అలా సెట్‌లోనే కన్నుమూయాలని కోరుకుంటా' అని అన్నారు.


