పుత్రోత్సాహం.. కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలుగుతుంది. ప్రయోజకుడైన అనిల్ రావిపూడిని చూసి ఆయన తండ్రి బ్రహ్మయ్య కూడా అంతే సంతోషపడుతున్నాడు. కాకపోతే కొడుకు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ దిశగా సాగిన ప్రయాణాన్ని మన శంకరవరప్రసాద్‌గారు ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్‌లో బ్రహ్మయ్య గుర్తు చేసుకున్నాడు.
కుళ్లుగా ఉంది
ముందుగా ఇండస్ట్రీకి ఇంతమంచి దర్శకుడినిచ్చినందుకు చిరంజీవి బ్రహ్మయ్యను ప్రశంసించాడు. బ్రహ్మయ్య ప్రతిరోజు సెట్‌కు వచ్చి కొడుకు ఎదుగుదలను చూసి సంతోషించేవాడు. ఈయన్ను చూస్తే నాకే కుళ్లు వచ్చేస్తుంది. నాకంటే ఎక్కువ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్‌గా కష్టపడి కొడుకును చదివించాడు. అయితే సినిమాల్లో అనిల్ రావిపూడిని చెడగొట్టిందే ఈయన.
ఇంకేం కావాలి
అనిల్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు నాన్నా.. చిరంజీవి సినిమా రిలీజైందనగానే అమ్మకు చెప్పకు పదా అని సినిమాకు తీసుకెళ్లేవాడు. నేను సినిమాల్లో వేసుకున్న డ్రెస్‌లను కొడుక్కి కుట్టించి అతడు డ్యాన్స్ చేసుంటే సంతోషపడ్డాడు ఇప్పుడు కొడుకు ఇంత గొప్ప దర్శకుడు అయి సూపర్ స్టార్స్‌ను డైరెక్ట్ చేస్తుంటే తండ్రిగా అతడికి ఇంకేం కావాలి అని మెచ్చుకున్నాడు.
మూడు సబ్జెక్ట్స్ ఫెయిల్
బ్రహ్మయ్య మాట్లాడుతూ.. నా కొడుకు బీటెక్ చదివేటప్పుడు మూడో సంవత్సరంలో మూడు సబ్జెక్టులు పోయాయి. చిరంజీవి సినిమాలు తెగ చూసేవాడు. అప్పుడు నేను.. చిరంజీవికి చెడ్డ పేరు తీసుకురాకురా.. ఆయన సినిమాలు చూసి చెడిపోయావంటారు అని భయపెట్టాను. దాంతో చదువు పూర్తి చేసి చిరంజీవిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు.
చిరంజీవి స్పీడ్
అనిల్ వంద మైళ్ల స్పీడులో సినిమా తీస్తే చిరంజీవి దాన్ని 200 మైళ్ల స్పీడులో ముందుకు తీసుకెళ్లాడు. ఉదయం తొమ్మిదిన్నరకు షూటింగ్ అంటే ఏడున్నరకే ఆయన సెట్‌లో ఉండేవాడు. మేము ఆదరాబాదరాగా పరిగెత్తేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే!
చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో రమణ గోగుల్ సాంగ్ డిలీట్.. ఎందుకంటే?


