'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా హిట్ కావడంతో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండురోజుల్లోనే రూ. 120 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే, సినిమాకు పెద్ద బడ్జెట్ కాకపోయినప్పటికీ చిరంజీవి, నయనతార, వెంకటేశ్ వంటి స్టార్స్ ఉండటంతో వారి రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందని టాక్.. ఈ మూవీకి నిర్మాతలుగా సాహు గారపాటితో పాటు చిరు కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. దీంతో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనే ప్రశ్న ఎక్కువమందిలో కలుగుతుంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాకు గాను తను రెమ్యేనరేషన్ మాత్రమే తీసుకున్నానని అనిల్ రావిపూడి అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను షేర్ ఏమీ తీసుకోవడం లేదన్నారు. చిరంజీవి కూడా సినిమా బడ్జెట్‌ను బట్టి తన పారితోషికం తీసుకున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో నయనతార, వెంకటేశ్ వంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారు.. ఆపై ఆయన కూతురు నిర్మాత కాబట్టి ఆమెకు కూడా కాస్త నాలుగు రూపాయలు మిగలాలి కదా అనే దృష్టిలో చిరు ఉన్నారని తెలిపారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అనిల్ రావిపూడి చెప్పారు.
ఎవరికి ఎంత రెమ్యునరేషన్..?
చిరంజీవి ప్రతి సినిమాకు రూ. 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ వుంది. అయితే, తన కూతురు నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఇందులో తన పారితోషికాన్ని కాస్త తగ్గించారని సమాచారం. ఇందులో శశిరేఖగా నయనతార ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్ర కోసం ఆమె ముందుగా రూ. 15 కోట్లు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఫైనల్‌గా రూ. 6 కోట్ల రెమ్యునరేషన్‌తో ఢీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రూ. 9 కోట్లు, అనిల్ రావిపూడి రూ. 25 కోట్లు తమ రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని సమాచారం.


