విజయ్‌, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్‌ | Vijay Deverakonda, Rashmika, Chiranjeevi Trisha And Other Popular Telugu Star Couples Set To Repeat Their Magic At Box Office | Sakshi
Sakshi News home page

విజయ్‌, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్‌

Mar 1 2026 9:31 AM | Updated on Mar 1 2026 10:04 AM

Vijay Deverakonda, Rashmika, Chiranjeevi Trisha, On Screen Success Pair Repeat

వెండితెరపై ఓ హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్‌ కూడా అయితే అప్పుడు ‘హిట్‌ పెయిర్‌’ అనిపించుకుంటారు. ఆ హిట్‌ పెయిర్‌ కాంబినేషన్‌కి ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్‌ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్‌ సాధించిన ఈ జంటకు సక్సెస్‌ రిపీట్‌ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్‌ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. 

రెండోసారి... 
ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్‌ హీరోయిన్‌గా, ఆషికా రంగనాథ్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్‌ ’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్‌ అవుతోంది. ‘

‘స్టాలిన్‌’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘‘వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్‌ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే.  
 
వందో చిత్రంలో...  
హీరో నాగార్జున, హీరోయిన్‌ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. 

ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ,  ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌ 100’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ మూవీకి తమిళ డైరెక్టర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ మైసూర్‌లో   జరుగుతోంది.  


మూడోసారి...   
హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా జోడీకి పాన్‌ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్‌–రష్మిక కాంబినేషన్‌ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్‌–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. 

విజయ్‌ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్‌ మూవీ తెరకెక్కించిన రాహుల్‌ సంకృత్యాన్‌ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టీ సిరీస్‌ ఫిలింస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా వారి లైఫ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్‌ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్‌ లైఫ్‌లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్‌ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్‌ కానుంది.  
 
సెకండ్‌ టైమ్‌ 
హీరో శర్వానంద్, హీరోయిన్‌  అనుపమా పరమేశ్వరన్‌ లది హిట్‌ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్‌ టైమ్‌ జోడీగా నటించిన ఈ జంట సెకండ్‌ టైమ్‌ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా, డింపుల్‌ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్‌–అనుపమ. 

వీరిద్దరూ ఫస్ట్‌ టైమ్‌ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్‌  వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో క్యూట్‌ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.

ఈసారి భయపెడతారు 
‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్‌  రెబా మోనికా జాన్‌. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్‌  29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్‌ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్‌  నటించిన సెకండ్‌ మూవీ ‘మృత్యుంజయ్‌’. హుస్సేన్‌  షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్‌’లో మాత్రం భయపెట్టనున్నారు. 

పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్‌’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్‌ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు.  

బేబీ హిట్‌తో... 
‘బేబీ’ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్స్‌ అయిపోయారు హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌  వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ నెలకొంది. ‘బేబీ’తో హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న ఆనంద్‌– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్‌’. ‘90స్‌’ (ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌) వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌  ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. 

కాగా ఎపిక్‌– ఫస్ట్‌ సెమిస్టర్‌ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్‌హిట్‌ జోడీ అనిపించుకున్న ఆనంద్‌–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్‌’ మూవీపై మంచి క్రేజ్‌ నెలకొంది.  

రెండోసారి...  
‘కోర్ట్‌’ సినిమాతో హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్‌ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్‌’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్‌’. రామ్‌ జగదీష్‌ దర్శకత్వం వహించారు. నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్‌ రోషన్‌–శ్రీదేవి హిట్‌ పెయిర్‌గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్‌లో వీరి జోడీకి ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్‌ బజ్‌ నెలకొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement