మెగాస్టార్ చిరంజీవి.. 70 ఏళ్లు దాటినా నేటి తరం హీరోలకు పోటీ ఇచ్చేలా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇకపై ఏడాదికి ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ స్థాయికి తగ్గ విజయం దక్కలేదనే మెగా అభిమానుల బాధ.. ‘మనశంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో తీరిపోయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
మెగా ఫ్యాన్స్‌తో పాటు చిరంజీవి కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తన సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి తాజాగా సీనియర్ పాత్రికేయులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
రాజకీయాల్లోకి వెళ్లడంతో దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైనా.. ఆ ఫీలింగ్ కలగలేదట. కానీ రాజకీయాల్లో బిజీ కావడంతో కొత్తగా వచ్చిన నటీనటుల గురించే తెలుసుకోలేకపోయారట. రీఎంట్రీ తర్వాత చేసిన తొలి సినిమా ‘ఖైదీ 150’ లో హీరోయిన్‌గా నటించిన కాజల్ గురించి అప్పటి వరకు చిరంజీవికి తెలియట. ‘ఖైదీ 150 సినిమాలో కాజల్ హీరోయిన్ అని చెబితే.. అసలు కాజల్ ఎవరు అని అడిగేశా. అంతలా ఇండస్ట్రీని మర్చిపోయా. తమన్నా అంటే ఎవరో కూడా తెలియదు. అంతలా ఇండస్ట్రీని మర్చిపోయాను. రీఎంట్రీ తర్వాత ఇండస్ట్రీని ఎంత గా మిస్ అయ్యానో అర్థమైంది’ అని చిరంజీవి అన్నారు. అంతేకాదు తన అనుభవాలన్నీ కలిసి కొన్ని పాడ్ కాస్ట్‌లు చేయాలనే ఆలోచన కూడా ఉందని చెప్పారు.


