సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్‌ | List Of Telugu Movies For Release In Sankranti 2026, Star-Studded Family Entertainers Ready To Wow Audiences | Sakshi
Sakshi News home page

Sankranti Release Movies List: సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్‌

Jan 7 2026 12:01 AM | Updated on Jan 7 2026 10:39 AM

List Of Telugu Movies For Release In Sankranthi 2026: Tollywood

తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్‌ అంటే టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్‌ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.

పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్‌ ‘ది రాజా సాబ్‌’, శర్వానంద్‌ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్‌  పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్‌గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.

భార్యా భర్తల నేపథ్యంలో...  
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్‌. ఈ ఏడాది వెంకటేశ్‌ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్‌ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తనదైన మార్క్‌ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్‌ రావిపూడి. ఇద్దరు స్టార్‌ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్‌ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ట్రేడ్‌ వర్గాల్లో మంచి జోష్‌ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్‌ ఎలిమెంట్స్‌ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్‌? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్‌’, ‘నా వాట్సప్‌ నంబరు కొంచెం అన్‌బ్లాక్‌ చేయవా ప్లీజ్‌’, ‘మనల్ని టార్చర్‌ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్‌లా ఉన్నావ్‌... ఇలా మాస్‌ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే...  ‘మాస్‌కే బాస్‌లా ఉన్నావ్‌... నువ్వు ఫ్యామిలీ సైడ్‌ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్‌ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది.  

భార్య... భర్త... ఓ ప్రేయసి 
రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది.

డింపుల్‌ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్‌ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్‌తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్‌ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్‌ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్‌ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్‌ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్‌ చెప్పలేకపోయాయేమో.

అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్‌ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్‌ గ్లింప్స్‌లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌ని నేడు గ్రాండ్‌గా లాంచ్‌ చేయబోతున్నారు మేకర్స్‌. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్‌ తిరుమల టచ్‌తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్‌ తెలిపారు.  

నానమ్మమనవడి కథ  
వరుస పాన్‌ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్‌’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.

‘ది రాజాసాబ్‌’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్‌ వింటేజ్‌ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్‌ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య  పాత్రను బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్, నానమ్మ క్యారెక్టర్‌ను జరీనా వాహబ్‌ చేశారు. ఈ మూవీ హారర్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్‌ తెలిపారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

‘‘ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్‌ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్‌’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్‌గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్‌ చెబుతుంటే నా సీన్న్స్‌ మర్చిపోయి నానమ్మ సీన్న్స్‌ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్‌ అయిపోయాను.

‘ది రాజా సాబ్‌’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్‌ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్‌లో వింటేజ్‌ లుక్‌లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్‌ ఇండోర్‌ సెట్‌ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్‌ ఇటీవల తెలిపారు.  

నారీ నారీ నడుమ మురారి 
నారీ నారీ నడుమ హీరో శర్వానంద్‌ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్స్‌పై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్‌ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్‌. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్‌ లీడర్‌గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్‌ అవుతారు.

ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్‌ గర్ల్‌ఫ్రెండ్‌. వీరిద్దరి మధ్య శర్వానంద్‌ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్‌ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్‌ నటించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్‌ లుక్, ప్రమోషనల్‌ పోస్టర్లు బజ్‌ క్రియేట్‌ చేశాయి. విశాల్‌ చంద్ర శేఖర్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్‌ అని చెప్పాచ్చు. ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.  

రాజుగారి పెళ్లి...  
‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్   పోలిశెట్టి.  ‘జాతిరత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌  పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్   పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌  పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్‌ యాక్సిడెంట్‌ కారణంగా కాస్త గ్యాప్‌ తీసుకున్నారు నవీన్‌.

రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్‌  పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి  వేసిన డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ పాటతో నవీన్   పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్‌ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్‌  పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.

జన నాయగన్‌
తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్‌’. (తెలుగులో జన నాయకుడు). హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్‌ కెరీర్‌లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్‌ ్ర΄÷డక్షన్స్ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్‌ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’కి రీమేక్‌గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్‌. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్‌ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది.  – డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement