ఒకవైపు సంక్రాంతి సంబరాలు... మరోవైపు సక్సెస్ సంబరాలతో సుష్మిత కొణిదెల ఫుల్ జోష్‌గా ఉన్నారు. తండ్రి చిరంజీవి హీరోగా ఆమె నిర్మించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఈ సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే సుష్మిత ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇది తనకు ‘సూపర్ సంక్రాంతి... స్పెషల్ సంక్రాంతి’ అంటున్నారామె. ఇంకా సంక్రాంతి పండగ గురించి ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సుష్మిత పలు విశేషాలు పంచుకున్నారు.
మా చిన్నప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంటికే పరిమితం. కాలేజ్ టైమ్‌లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పట్నుంచి బెంగళూరులో మా ఫామ్‌హౌస్‌లో జరుపుకోవడం ఆనవాయితీ అయింది. పండగలప్పుడు అందరూ కలిసి మన సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలని మా నాన్నగారు అనుకుంటారు. అలా అందరూ కలిసి ఈ పండగ నాలుగు రోజులు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, పిండివంటలు, నాన్‌వెజ్ అవీ తింటూ సరదాగా గడపటం వల్ల బంధాలు బలపడతాయని ఆయన నమ్ముతారు. అది నిజం అని మాకు అర్థం అయింది.
వేడి కాఫీ... హాట్ దోసె
భోగితో ్రపారంభించి, కనుమ వరకూ మా సెలబ్రేషన్స్ హంగామాగా ఉంటాయి. భోగి రోజున తెల్లవారుజాము ఐదు గంటలకల్లా చలి మంట వేస్తాం. అక్కడే లైవ్ కిచెన్ ఏర్పాటు చేసుకుంటాం. ముందు వేడి వేడి కాఫీతో మొదలుపెట్టి, రకరకాల దోసెల వరకూ బ్రేక్‌ఫాస్ట్ ఫుల్లుగా లాగించేస్తాం. ముందు మా నాన్న ఒక దోసె వేస్తారు. ఆ తర్వాత ఇంట్లో మిగతా మగవాళ్లు కూడా గరిటె తిప్పుతారు.
భోగి రోజు మా ఇంట్లో లేడీస్‌కి దాదాపు రెస్ట్ అన్నమాట (నవ్వుతూ). ఆ తర్వాత లంచ్ కూడా గ్రాండ్‌గా ఉంటుంది. వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ వరకూ బోలెడన్ని వంటకాలు. మా ఇంటికి ఉపాసన వచ్చాక సంక్రాంతి మెనూ ఇంకా పెద్దదైంది. ముఖ్యంగా ఈ పండగకి మేం ‘మిక్సర్’ చేస్తాం. ఆ మిక్సర్ నా ఫేవరెట్. నో డైట్... ఓన్లీ చీట్ అనుకుని, నచ్చినవన్నీ తింటాం.
నేను... చరణ్ వేరే జట్టు
చిన్నప్పట్నుంచి నాకు కైట్స్ పెద్దగా ఇంట్రస్ట్ లేదు. కైట్స్ అంటే మాత్రం వరుణే (హీరో వరుణ్ తేజ్). తను హైట్‌గా ఉంటాడు కాబట్టి అదో అడ్వాంటేజ్. అయితే సేఫ్టీగా ఎగురవేస్తాం. అలాగే అందరం కలిసి అంత్యాక్షరి ఆడతాం. మా కజిన్ నైనికా గొంతు బాగుంటుంది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’లోని ఫ్యామిలీ మాంటేజ్ సాంగ్ తనే పాడింది. ఆ తర్వాత మా పిన్ని పద్మజ కూడా బాగా పాడుతుంది. ఇక ‘టగ్ ఆఫ్ వార్’ (తాడు లాగే ఆట) గేమ్ సందడి భలేగా ఉంటుంది. ఈ గేమ్‌లో నన్ను, చరణ్ (హీరో రామ్‌చరణ్)ని వేరే జట్టులో వేస్తారు. ఇద్దరం ఒకే జట్టులో ఉంటే చీట్ చేస్తామని అలా ΄్లాన్ చేస్తారు. యంగ్æ, మిడిల్ ఏజ్డ్, ఎల్డర్స్... ఇలా మూడు జట్లుగా విడిపోయి టగ్ ఆఫ్ వార్ ఆడతాం. చిన్నవాళ్లందరం కలిసి కబడ్డీ కూడా ఆడతాం.
ఈసారి అమ్మ చీరలే...
పండగకి మంచి మంచి ఔట్‌ఫిట్స్ సెలక్ట్ చేసుకుంటుంటాను. అయితే ఈసారి సినిమాప్రొడక్షన్‌తో బిజీ కాబట్టి ΄్లాన్ చేయలేదు. మా అమ్మ దగ్గర మంచి మంచి చీరలు ఉన్నాయి. ఆవిడ వార్డ్‌రోబ్ ఓపెన్ చేసి, నచ్చిన చీరలు కట్టుకోవాలనుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే నాకో పెద్ద సెలబ్రేషన్‌లా అనిపిస్తుంది. పల్లెటూళ్లల్లో బాగా చేసుకుంటారు. మేం స్వయంగా విలేజ్‌కి వెళ్లకపోయినా అక్కడ బంధువులు అందరూ కలిసి ఎలా చేసుకుంటారో మేం అలా చేసుకుంటాం. ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినప్పుడు ఆ స్ట్రెంత్, ఆ వైబ్ వేరు. పిల్లలకు మన సంప్రదాయాలు తెలుస్తాయి... కుటుంబ అనుబంధాల విలువ కూడా తెలుస్తుంది.
ఆ డైలాగ్ ఇష్టం
ఈసారి మా సంక్రాంతి సెలబ్రేషన్ హైదరాబాద్‌లోనే. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ రిలీజ్ హడావిడి, ప్రమోషన్, ఇప్పుడు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్‌లో పండగ చేసుకుంటున్నాం. నా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ మీద మా నాన్నగారితో సినిమా తీయడం, అది సూపర్ హిట్ కావడంతో ఇది మాకు ‘సూపర్ సంక్రాంతి... స్పెషల్ సంక్రాంతి’లా భావిస్తున్నాను. ఈ సినిమాలో ఒక సీన్‌లో ‘రేఖ... శశిరేఖ’ అని నాన్న చెప్పిన డైలాగ్ నాకు ఇష్టం. మా అమ్మ పేరు (సురేఖ) కూడా ఉంది కాబట్టి, ఆ విధంగానూ ఈ సినిమా నాకు స్పెషల్. అమ్మ మనసు ఎప్పుడూ పిల్లల కష్టం గురించే ఆలోచిస్తుంటుంది. ఆ కష్టం తాలూకు సక్సెస్ గురించి కూడా ఆలోచించదు. ఒకవైపు సినిమాప్రొడక్షన్, పిల్లలను చూసుకుంటూ కష్టపడిపోతున్నావని అమ్మ తెగ ఫీల్ అయ్యేది (నవ్వుతూ). ఇక మేం ఎంజాయ్ చేస్తున్నట్లే అందరూ తమ ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతి జరుపుకోవాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
ఇంటర్వ్యూ: డి.జి. భవాని


