తొలగని ‘దారి’ద్య్రం
హొళగుంద: హొళగుంద–ఢణాపురం రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డులో మారెమ్మ వంక నుంచి ఢణాపురం వరకు ప్రయాణం నరకాన్ని చూపిస్తోంది. మొత్తం 25 కి.మీ. దూరం ఉన్న ఈ ఆర్‌అండ్‌బీ డబుల్ రోడ్డు నిర్మాణానికి గతంలో ఎన్‌డీబీ నిధులు రూ. 62.29 కోట్లు మంజూరయ్యాయి. వివిధ కారణాలతో అర్ధాంతరంగా పనులు నిలిపేశారు. ఇటీవల నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా నేటికి పనులు మొదలు పెట్ట లేదు. వందవాగిలి క్రాస్, హెబ్బటం, నాగనాథన హళ్లి మధ్య అడుగుఅడుగునా గుంతలు ఉన్నాయి. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో గుంతలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు దుస్థితిని చూసి ఎల్లార్తి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో దూరం, ఖర్చు పెరగడమే గాక సమయం వృథా అవుతోంది.


