గణతంత్ర వేడుకులకు సర్వం సిద్ధం
● ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం
● ఉదయం 9 గంటలకు
వేడుకలు ప్రారంభం
కర్నూలు: గణతంత్ర వేడుకలకు పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలోని పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందు కోసం మైదానాన్ని రంగురంగుల జెండాలతో అలంకరించారు. వేదికకు ఇరువైపులా వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. పురప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు కూర్చునేందుకు కూడా ప్రత్యేక వేదికలను తీర్చిదిద్దారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మైదానం మొత్తం మున్పిపల్ అధికారులు ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు. కొండారెడ్డిబురుజును విద్యుత్ బల్బులతో అలంకరించారు.
కవాతు రిహార్సల్స్ పరిశీలన
గణతంత్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. రిహార్సల్స్‌ను అడిషనల్ ఎస్‌పీలు హుసేన్‌పీరా, క్రిష్ణమోహన్ హాజరై గౌరవ వందనం స్వీకరించి కవాతును పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, గ్యాలరీలు, స్టాల్స్‌ను పరిశీలించారు. వేడుకలకు అతిథులు, ప్రముఖులు హాజరవుతున్నందున భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, మంచి నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. హోంగార్డ్ డీఎస్పీ ప్రసాద్‌తో పాటు ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సివిల్, ఏఆర్, ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్థులు రిహార్సల్స్‌లో పాల్గొన్నారు.
విస్తృత తనిఖీలు ...
గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పోలీస్ శాఖ నగరంలో ముందస్తు తనిఖీలు చేపట్టింది. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, వీఐపీలు హాజరు కానుండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన దాదాపు 400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థలకు చెందిన ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందించనున్నారు.


