నగలు ధరించి రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దు
కర్నూలు: ఉత్సవాలు, జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకుని వెళ్లకపోవడమే ఉత్తమమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. బంగారం ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో దొంగతనాలకు అవకాశమివ్వకుండా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇళ్ల దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు బంగారానికి మెరుగులు దిద్దుతామంటూ ఇళ్ల వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే సమాచారమివ్వాలని కోరారు. వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు ధరించిన మహిళలు అప్రమత్తతతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యంత విలువైన ఆభరణాలు ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో దాచుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100, 112కు ఫోన్ చేసి సమాచారమివ్వాలన్నారు. ప్రజల సహకారంతోనే నేరాల కట్టడి సాధ్యమవుతుందని, అప్రమత్తతే భద్రతకు మూలమని ఎస్పీ తెలియజేశారు.
గడిగరేవుల పొలాల్లో చిరుత సంచారం
గడివేముల: మండలంలోని గడిగరేవుల గ్రామ సమీపంలోని పొలాల్లో శుక్రవారం చిరుత పులి కనబడటంతో రైతు భయంతో పరుగు తీశారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ రామ్మోహన్‌రెడ్డి ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. డిప్యూటీ రేంజర్ విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్ అబ్దుల్ కలాం పొలాలను పరిశీలించారు. గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.


