వచ్చాడయ్యో స్వామి..
ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకున్న అహోబిలేశులు
గోవింద నామస్మరణతో మార్మోగిన పుర వీధులు
ఉత్సవ పల్లకీకి స్వాగతం పలికిన ప్రభుత్వ యంత్రాంగం
పట్టణంలో ఓబులేశుడి తిరునాల షురూ
ఆళ్లగడ్డ: అహోబిలేశుడి పార్వేట మహోత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ పల్లకీ గ్రామగ్రామాన విశేష పూజలందుకుంటూ శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకుంది. ఉత్సవమూర్తులైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములు కొలువైన ఉత్సవ పల్లకీ ఉదయం పడకండ్లలో పూజలు ముగిసిన అనంతరం ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకుంది. పల్లకీ పట్టణ పొలిమేరలోని వక్కిలేరు బ్రిడ్జిపైకి రాగానే స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యంలో ఎదురేగి గోవిందా.. గోవింద అంటూ నీరాజనం పలికారు. మంగళ వాయిద్యాల మధ్య తన్వయత్వంతో పల్లకీని భుజాలపై ఎత్తుకుని పట్టణానికి తోడ్కొనివచ్చి మొదటి తెలుపైన సర్కార్ తెలుపుపై కొలువుంచారు.
కొనసాగిన సంప్రదాయం..
స్వామి ఉత్సవ పల్లకీ పట్టణ పొలిమేరకు చేరుకున్న వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కుల,మతాలకు అతీతంగా ఘన స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం ఉత్సవమూర్తులు మొదటగా ప్రథమ తెలుపు (సర్కారు తెలుపు)పై కొలువుదీరుతారు. అనంతరం ఒక్కో ప్రభుత్వ శాఖ కార్యాలయం వద్దకు స్వామి దూతలు వెళ్లి ఆ కార్యాలయ అధికారి, సిబ్బందిని స్వామి దగ్గరకు మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి దర్శన భాగ్యం కల్పిండం బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. నేటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా మొదట పురపాలక సంఘం (గ్రామ పంచాయతీ), తహసీల్దార్ , పోలీసు, ఉప ఖజానా, కార్యాలయ అధికారులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
వాహనాల మళ్లింపు..
పాత బస్టాండు నుంచి సంత మార్కెట్ వరకు అహోబిలం రోడ్డులో ఇరువైపుల తిరునాల అంగళ్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్, పోలీస్ అధికారులు పాతబస్టాండు నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు. ఈ రహదారిలో వెళ్లే వాహనాలను మరో దారిలో మళ్లించారు. ముత్యాలపాడు – చాగలమర్రి, అహోబిలం, రుద్రవరం తదితర గ్రామాల వైపు వెళ్లనున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలు బైపాస్ రోడ్డుమీద తిరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ తిరునాల ముగిసే వరకు వాహనాలు ఈ రహదారిలోనే తిరిగేలా పోలీస్, మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మొదలైన తిరునాల
శ్రీ అహోబిలేశుడి తిరునాల అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలా నరసింహుడు, ప్రహ్లాదవరదుడు కొలువైన ఉత్సవ పల్లకీ ఏ గ్రామానికి వెళితే అక్కడ తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఉత్సవ పల్లకీ పట్టణానికి చేరుకున్న సందర్భంగా పట్టణంలో ప్రధాన వీధుల్లో తిరునాల అంగళ్లు వెలిశాయి. దీంతో పట్టణ ప్రధాన వీధులు కిక్కిరిసి పోయాయి. చిన్న పిల్లలు, యువతీ యువకులు రంగుల రాట్నాల్లో తిరుగుతూ కేరింతలు కొడుతుంటే మహిళలు తమ ఇళ్లకు వచ్చిన ఆడపడుచులకు, స్నేహితులకు సంప్రదాయంగా గాజులు, కుంకుమను బహుమతిగా ఇస్తున్నారు. దీంతో పట్టణంలో వెలిసిన గాజులు, కుంకుమ అంగళ్లు మహిళలతో కిక్కిరిసిపోతున్నా యి. చిన్న పిల్లలను ఆట బొమ్మల దుకాణాలు ఆకట్టుకుంటున్నాయి. పట్టణ సీఐ యుగంధర్, ఎస్‌ఐ నగీనల పర్యవేక్షణలో ప్రత్యేక బలగాలతో డీఎస్పీ ప్రమోద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వచ్చాడయ్యో స్వామి..
వచ్చాడయ్యో స్వామి..


