ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం

Jan 31 2026 7:17 AM | Updated on Jan 31 2026 7:17 AM

ఘనంగా

ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం

హొళగుంద: సిద్ధేశ్వరస్వామి జాతర శుక్రవారం సాయంత్రం వసంతోత్సవంతో వైభవంగా ముగిసింది. గత నెల 23న కంకణ ధారణతో ప్రారంభమైన జాతరలో భాగంగా 28న రథోత్సవం, 29న లంకాదహనం కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. శుక్రవారం వసంతోత్సవంలో భాగంగా ఆలయంలో సిద్ధేశ్వరునికి ఆకుపూజ, మహామంగళారతి, అభిషేకాలు, తదితర పూజలు చేపట్టారు. అనంతరం రాత్రి పల్లకీలో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ పూజారుల ఇంటికి చేర్చడంతో ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన పలు సామాజిక నాటకాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

కారులో వచ్చి చైన్‌ స్నాచింగ్‌

ఆలూరు రూరల్‌: బంగారు నగల దొంగలు శ్రుతి మించుతున్నారు. ఏకంగా కారులో వచ్చి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఆలూరులో ఓ మహిళ మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు చైన్‌ను దోచుకెళ్లారు. పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులోని మార్కెట్‌ యార్డు పక్కన ఉన్న ఇంటి వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు సరోజమ్మ తెలిపిన వివరాల మేరకు. సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఇంటి ముందు నిలిపారు. అందులో ఒక వ్యక్తి సరోజమ్మ దగ్గరకు వెళ్లి నీ భర్త ఉన్నాడా.. అని అడిగాడు. ఆ సమయంలో ఆమె భర్త వెంకటరామప్ప లేడని చెప్పగా, ఫోన్‌ నంబర్‌ కావాలని ఆడిగాడు. సరోజమ్మ తన భర్త ఫోన్‌ నంబర్‌ చెబుతుండగా సెల్‌ ఫోన్‌ లేదని, నంబర్‌ రాసుకోవడానికి పెన్ను, పేపర్‌ ఇవ్వాలని అడిగాడు. ఆమె తిరిగి ఇంట్లోకి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి మెడలోని బంగారు గొలుసు లాక్కొని కారెక్కి పరారైనట్లు తెలిపారు. అపహరణకు గురైన బంగారు గొలుసు 45 గ్రాములు ఉందని చెప్పారు. గుర్తుతెయని వ్యక్తులు బంగారు గొలుసు ఎత్తికెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలుడి అప్పగింత

శ్రీశైలం: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో ఒంటరిగా శ్రీశైలం చేరుకున్న బాలుడిని పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ సుబ్బారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా భీమునిపల్లికి చెందిన భరత్‌ సింహా రెడ్డి(15) తల్లిదండ్రులతో గొడవ పడి శ్రీశైలం చేరుకున్నాడు. క్షేత్ర పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలుని వివరాలను సేకరించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు శుక్రవారం శ్రీశైలం చేరుకోవడంతో అప్పగించామన్నారు.

గోనెగండ్ల హైస్కూల్‌

వంట ఏజెన్సీ తొలగింపు

గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మధ్యాహ్న వంట ఏజెన్సీని తొలగించినట్లు ఎంఈఓ నీలకంఠ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి గోనెగండ్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనంలో నాణ్యత లేదని, మెనూ ప్రకారం పాటించడం లేదని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వంట ఏజెన్సీని తొలగించాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వంట ఏజెన్సీని తొలగిస్తున్నట్లు నోటీసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఏజెన్సీ వారు మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ పాలకవర్గ సభ్యులు నియామకం

కర్నూలు (అగ్రికల్చర్‌): ఆంధ్రప్రదేశ్‌ సీడ్‌ సర్టిఫికెట్‌ అథారిటీ పాలకవర్గం సభ్యులు (గవర్నింగ్‌ బాడీ)గా సీడ్‌ మెన్‌ అసోసియేషన్‌ నుంచి ఇద్దరు సభ్యులను నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు సభ్యులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినవారు కావడం విశేషం. కర్నూలు జిల్లా నుంచి శ్రీకృష్ణ సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా నుంచి మంజీరా సీడ్స్‌ ప్రొప్రైటర్‌ సి.రామ మద్దిలేటిలను నామినేట్‌ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ జీవో జారీ చేశారు. వీరు రెండేళ్ల పాటు పాలకవర్గం సభ్యులుగా కొనసాగుతారు.

ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం 1
1/2

ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం

ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం 2
2/2

ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement