● నేడు జూపాడుబంగ్లా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ● ఎంపీటీ
జూపాడుబంగ్లా: ఒక్క ఎంపీటీసీ స్థానం లేకపోయినా అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్లు ప్రజా తీర్పును అవమానిస్తూ జూపాడుబంగ్లా ఎంపీపీ సీటును కై వసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూపాడుబంగ్లా ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే సభలో ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా.. వీగిపోతుందా అనేది నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నయానో.. భయానో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరు గురు ఎంపీటీసీ సభ్యులను అధికారపార్టీ నాయకులు తమ వైపు తిప్పుకొని ఎంపీపీ సువర్ణమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో భాగంగా శనివారం ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి అధ్వర్యంలో జూపాడుబంగ్లా ఎంపీడీఓ కార్యాలయంలో తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులతో అవిశ్వాస తీర్మాన సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే తమకు అనుకూలమైన ఎంపీటీసీ సభ్యులను తెలుగు తమ్ముళ్లు క్యాంపు తరలించగా జూపాడుబంగ్లా–2 ఎంపీటీసీ కృపాకర్‌ను నరసరావుపేట వద్ద అడ్డుకొని వెనక్కి పిలుచుకొని వచ్చిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈనేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న తూడిచెర్ల ఎంపీటీసీ దొడ్డా నాగమణిని అధికారపార్టీ నాయకులు క్యాంపునకు తరలించటం గమనార్హం. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించనున్న అవిశ్వాస తీర్మానం సభకు ఎంత మంది సభ్యులు హాజరవ్వనున్నారు? వారిలో ఎంత మంది మద్దతు పలుకుతారు? అనే విషయం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సభలో తొమ్మిది మంది ఉండగా వారిలో ఆరుగురు తప్పసరిగా మద్దతు పలికితే తీర్మానం నెగ్గే అవకాశం ఉంది, లేదంటే వీగిపోనుంది. ఈ నేపథ్యంలో పీఓగా వ్యవహరించే ఆర్డీఓ నాగజ్యోతి తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.


