చైన్ స్నాచర్ల అరెస్ట్
ఆలూరు రూరల్: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. ఆలూరు పోలీసు స్టేషన్ ఆవరణలో బుధవారం ఎస్‌ఐ మన్మధ విజయ్‌తో కలిసి సీఐ రవి శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత నెల జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులో నివాస ఉంటున్న సరోజమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి భర్త ఫోన్ నంబర్ అడిగి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు రోజుల్లో కేసు ఛేదించారు. డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన జగన్‌మోహన్ రెడ్డి, రుద్రవరం మండల నందనపల్లె గ్రామానికి చెందిన తిరుపతి సురేష్ స్నేహితులు. నేర ప్రవృత్తి కలిగిన వీరే ఆలూరు వచ్చి సరోజమ్మ మెడలోని బంగారు చైను దోచుకెళ్లినట్లు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం ఆలూరు మండలంలోని అంగసకల్లు గ్రామ రోడ్డులో నిందితులు కనిపించడంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ చైన్ స్నాచర్లపై తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాలోని ఉండవల్లి పీఎస్‌లో రౌడీ షీటర్ ఉందని, అలాగే వివిధ పోలీసు స్టేషన్లలో 5 కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు వెల్లడించారు.


