పరమేశ్వరా.. నిర్లక్ష్యం చూడవా!
మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు
శ్రీగిరిలో పూర్తి కాని ఉత్సవ ఏర్పాట్లు
ఇప్పటికే క్షేత్రానికి ప్రారంభమైన భక్తుల రాక
శ్రీశైలంటెంపుల్: మరో మూడు రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భక్తుల రాక కూడా మొదలైంది. అయితే క్షేత్రంలో ఉత్సవ ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. రెండుమూడురోజుల ముందే ఉత్సవ శోభ కనిపించేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో పరమేశ్వరా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఏవీ అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందుకు సాగని పనులు
శ్రీశైలంలో జర్మన్‌షెడ్లతో తాత్కాలిక క్యూ కంపార్ట్‌మెంట్, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇరువైపులా భక్తులు సేదతీరేందుకు జర్మన్ షీట్లతో భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద టెంజైల్ షెడ్‌తో మరో క్యూ కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్లు, టాయిలెట్లు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆలయ గోపురాలకు, ఉభయ దేవాలయాలకు విద్యుద్దీకరణ, చలువ పందిళ్లు, షామియానాలు, ఉద్యానవనాల్లో, ఆరుబయలు ప్రదేశాల్లో షామియానాలు ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు, ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు ప్రధానరోడ్డుకు ఇరువైపులా గ్రావెల్‌తో చదును చేసే పనులు, పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పాతాళగంగ వద్ద ఇనుప మెష్‌తో బారికేడింగ్, ప్రధాన రోడ్లలో డివైడర్లకు పెయింటింగ్, తాత్కాలిక టాయిలెట్లు తదితర పనులు ఇంకా పూర్తి కాలేదు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇంకా ఇవ్వలేదు. మరో మూడు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా ఈ పనులన్నీ పూర్తవుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
సమీక్షలకే సరి
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8వ తేది నుంచి 18వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం విస్తృ త ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. దేవస్థాన ఈఓ ఆధ్వర్యంలో రెండు సార్లు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సారి, ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగంతో సహా దేవస్థాన అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి, ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు చేశారు. క్షేత్ర పరిధిలో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అయినా, ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
పరమేశ్వరా.. నిర్లక్ష్యం చూడవా!


