ఆటోలతో విన్యాసాలు చేసి.. పోలీసులకు చిక్కి!
● ముగ్గురు యువకులు అరెస్టు.. ఆటోలు సీజ్
కర్నూలు: కర్నూలు–హైదరాబాద్ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆటోలతో ముగ్గురు యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మూడు పోలీసు బృందాలను రంగంలోకి దింపి మమతా నగర్‌కు చెందిన శివ మల్లేష్, పేరపోగు అఖిల్, అశోక్ నగర్‌లోని శ్రీకృష్ణ కాలనీకి చెందిన గనమూరు జయసింహలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈనెల 1వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో పై ముగ్గురు నిందితులు పంచలింగాల సర్కిల్ దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఆటోలు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల ఫిర్యాదుతో బుధవారం వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి ఆటోలను తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ సరదా కోసం రోడ్లపై వాహనాలతో విన్యాసాలు చేస్తే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఆటోలతో విన్యాసాలు చేసి.. పోలీసులకు చిక్కి!


