ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధం
18 ఏళ్లు నిండిన యువతీ, యువకులంతా ఓటర్లుగా నమోదు కావాలి
జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవ సంబరాలు
కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశం. అగ్రరాజ్యమైన అమెరికా కంటే మన దేశంలోనే ప్రజాస్వామ్య విలువలు ఎక్కువ. భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందంటే అందుకు కారణం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు పరిపాలించడమే. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలన్నీ ప్రజా ప్రభుత్వాలే. ఇలా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నికలు ఎంతో తోడ్పాడుతున్నాయి. ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలకు రాజ్యాంగం అందించింది. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను ఓటరుగా మార్చేందు కు, యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగా ఎన్నికల సంఘం ఆవిర్భవించిన జనవరి 25వ తేదీని 2011 సంవత్సరం నుంచి జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుతోంది. వృద్ధుల నుంచి మధ్య వయస్సు వారు, 18–19 ఏళ్ల యువతీ,యువకుల వరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నూటికీ నూరు శాతం పోలింగ్ నమోదు అయ్యేలా ఓటు విలువను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలకు చేపడుతున్నారు.
నేడు అధికారులతో ఎన్నికల ప్రతిజ్ఞ
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఎన్నికల ప్రతిజ్ఞ కార్యక్రమాలను ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయిలో డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజలతో నా భారతదేశం – నా ఓటు అనే థీమ్‌తో ఎన్నికల ప్రతిజ్ఞ చేస్తారు. అలాగే ప్రతీ బూత్ లెవల్లోనూ బీఎల్‌ఓలు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కాగా, కలెక్టరేట్‌లో సునయన ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్స వం సభను నిర్వహించి ఎన్నికల ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ఎన్నికల అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తారు.
18 ఏళ్లు నిండితే ఓటరుగా నమోదుకు అవకాశం...
భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించింది. కావున, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏటా అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ఓటరు నమోదు సవరణ జాబితాను సిద్ధం చేస్తారు. భారతదేశ పౌరసత్వం కలిగి ఉండి విదేశాల్లో ఉండే వారు కూడా తగిన ఆధారాలు చూపి ఓటరుగా నమోదు కావచ్చు. ఎప్పుడు 18 ఏళ్లు నిండిన అదే సమయం నుంచి ఓటును ఏపీ సీఈఓ సైట్ ద్వారా 365 రోజులపాటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అదేవిధంగా సవరణ జాబితాలను కూడా ఏడాదికి రెండుసార్లు ప్రకటిస్తారు.
సర్‌తో ఆందోళన...
భారత జాతీయ ఎన్నికల కమిషన్ సాధారణంగా ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్‌తో ఓటరు జాబితాను పరిశీలించేది. దీని ప్రకారం జాబితాలో ఉన్న వారు ఎవరైనా చనిపోయినా, అనర్హులకు ఓటు ఉన్నా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, ఇంటి మార్పు చేసుకున్నా వారి వివరాలను మాత్రమే పరిశీలించి మార్పులు, చేర్పులు చేసేవారు. అయితే రెండేళ్లుగా ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)తో ముందుకు వచ్చింది. దీనిప్రకారం జాబితాలోని ప్రతి ఓటును ఎన్నికల కమిషన్ పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తుంది. ఈ క్రమంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాలో మొత్తం 20,62,569 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుష ఓటర్లతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు 28,109 మంది అధికంగా ఉన్నారు. 18–19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 27,927గా ఉంది.
జిల్లాలో ఓటర్ల
వివరాలు
(2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రకారం)


