మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవా సహాయం
● లీలా వెంకటశేషాద్రి
కర్నూలు: దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు శనివారం కర్నూలు సీ క్యాంప్‌లోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్‌లో మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో మాజీ సైనికుల కోసం నల్సావీర్ పరివార్ సహాయత యోజన 2025లో భాగంగా ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించామన్నారు. ఈ క్లినిక్‌లో న్యాయవాది, పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వీరు మాజీ సైనికులకు చట్టబద్ధమైన సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయాన్ని అందించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులన్నా. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్‌ఆర్ రత్నరూత్, న్యాయవాది విజయ, పారా లీగల్ వాలంటీర్ మధుసూదన్, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు.


