కుష్టు వ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు (అర్బన్): జిల్లాలో కుష్టు వ్యాధిని నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఏర్పాటైన ‘స్పర్శ’ లెప్రసీ అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ ఏడాది ‘వివక్షతను అంతం చేయడం – గౌరవాన్ని కాపాడదాం’ అనే థీమ్‌తో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా స్పర్శ లెప్రసి అవగాహన ప్రచార వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాలు, వార్డులు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, చికిత్స విధానాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. కుష్టు వ్యాధిపై ఉన్న అపోహలు, వివక్షతను తొలగిస్తూ బాధితులకు సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ భాస్కర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి.మల్లికార్జున రెడ్డి, డీపీఎంఓస్ టి.చంద్రశేఖర్ రెడ్డి, వై.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


