రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలి
మహానంది: రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేలా కొత్త పరిశోధనలు చేపట్టాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిటైర్డ్ డైరెక్టర్, డీన్ డాక్టర్ ఆర్‌వీఎస్ రెడ్డి అన్నారు. మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో బుధవారం బుక్కాపురంలో రైతు సదస్సు, ఉద్యాన పంటల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆర్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యాన, వ్యవసాయ విద్యలను అభ్యసించే విద్యార్థులు నూతన ఆవిష్కరణలు దిశగా పరిశోధన చేయాలన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులు మంచి ఆదరణ ఉందని, కొనుగోలు చేసేందుకు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతున్నారన్నారు. నూతన సాంకేతిక పద్ధతులు, పరిజ్ఞానం అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు కుంచపు లక్ష్మీ నరసమ్మ, సర్పంచ్ కందుల వరలక్ష్మమ్మ, ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ సీహెచ్ కిషోర్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త ఠాగూర్ నాయక్, శాస్త్రవేత్తలు డాక్టర్ దీప్తి, డాక్టర్ హేమాద్రి, ఉద్యాన అధికారి హరేంద్ర, అనంతరాజుపేట ఉద్యాన కళాశాల, ఎన్‌ఎస్ కళాశాల ఏడీఆర్‌లు డాక్టర్ బి. హరి మల్లికార్జునరెడ్డి, సూర్యతేజ, మంజూష, తదితరులు పాల్గొన్నారు.


