లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలి
● వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు(టౌన్): పవిత్ర తిరుపతి వెంకన్న ఆలయంలో కల్తీ కొవ్వుతో లడ్డూలు చేస్తున్నారంటూ ప్రపంచ వ్యాప్త హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్తీ లడ్డుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టిన అత్యున్నత సంస్థ సీబీఐ లడ్డూ పవిత్రతకు భంగం కలిగినట్లు ఎలాంటి అధారాలు లేవని స్పష్టం చేసిందన్నారు. గురువారం ఆయన స్థానిక వెంకటరమణ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరితో కలిసి పూజలు చేసి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారన్నారు. అసత్య ప్రచారాలకు చెక్ పడిందని, నిత్యం సనాతన ధర్మం, హిందువుల గురించి మాట్లాడే కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ ఇప్పటికై నా బయటకు రావాలన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.


