ముత్తలూరుకు మేము వెళ్లం!
● అధికార పార్టీ నేతల తీరుతో ఉద్యోగుల బెంబేలు ● బాధ్యతలు చేపట్టేందుకు పంచాయతీ కార్యదర్శి వెనకడుగు
రుద్రవరం: ప్రభుత్వ అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ఉద్యోగులు విధులు నిర్వహించలేక సెలవులపై వెళ్తున్నారు. ఇందుకు ఉదాహరణ మండలంలోని ముత్తలూరు గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. గ్రామ సర్పంచ్ కురువ మహేశ్వరి కొంత కాలంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. వాటికి సంబంధించి బిల్లులు చేయాలని పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్‌ను అడిగారు. విష యం తెలుసుకున్న టీడీపీ నాయకుడు కూడా తాము చేసిన అభివృద్ధి పనులకు ముందు బిల్లులు చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పనులకు సంబంధించి ఎం. బుక్ తదితర రికార్డులు లేకపోవడంతో బిల్లు చేయలేనని తేల్చి చెప్పాడు. దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావించిన ఆ కార్యదర్శి మెడికల్ లీవ్‌పై వెళ్లారు. దీంతో ఆలమూరు పంచాయతీ కార్యదర్శి నాములేటికి ముత్త లూరు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే సమస్యాత్మక గ్రామంలో తాను బాధ్యతలు చేపట్టలేనని ఉన్నతాధికారులకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు 10 రోజులుగా సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.


