కుష్టు వ్యాధికి ఏదీ కళ్లెం!
జిల్లాలో కుష్టు వ్యాధి కేసుల నమోదు వివరాలు
కర్నూలు(హాస్పిటల్): కుష్టు వ్యాధిగ్రస్తుడంటే ఒక అస్పృశ్యత, అంటరానితనంగా భావించే వారు ఒకప్పుడు. ఆ వ్యాధిగ్రస్తుడుంటే ఊరికి దూరంగా ఉంచేవారు. వారిని అక్కడే ఉంచి అవసరమైన చికిత్స, అవసరాలు అందించేవారు. ఇలాంటి బాధితులతో ఏర్పడిన కాలనీలు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఈ వ్యాధిపై కొన్నేళ్లుగా ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో క్రమంగా కుష్టువ్యాధి బాధితులూ అందరితో పాటు కలిసి జీవిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని వందేళ్ల క్రితమే మహాత్మాగాంధీ చెబుతూ దగ్గరుండి వారికి సేవలు చేశారు. ఆయన వారికి అందించిన సేవలకు గుర్తుగా వర్ధంతి రోజును జాతీయ కుష్టు వ్యాధి వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఐదు సీహెచ్‌సీలు, ఒక బోధనాసుపత్రి, ఒక ఏరియా ఆసుపత్రి ఉన్నాయి. దీంతో పాటు 672 సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రతి సంవత్సరం కొత్తగా కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశ, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. లక్షణాలున్న వారిని మొదటగా పీహెచ్‌సీల్లోని మెడికల్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయిస్తున్నారు. వారికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పంపించి ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. అనాథలైన కుష్టు వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు కర్నూలు నగరం నందికొట్కూరు రోడ్డులో ఉన్న మరియా నిలయం ఏర్పాటు చేశారు. అక్కడున్న వైద్యులు, సిబ్బంది, సేవకులు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారు.
కొత్త కేసులు పుట్టుకొస్తునే ఉన్నాయి...!
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని లెప్రసీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆశ, ఏఎన్‌ఎంలచే ఇంటింటి సర్వే చేయించి కొత్త కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కొత్తగా కేసులు పుట్టుకొస్తునే ఉన్నాయి. ప్రస్తుతం పాత కేసులతో కలిపి జిల్లాలో మొత్తం 174 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. కొత్తగా ప్రతి లక్ష మందిలో 6.96 మందికి కుష్టువ్యాధిగ్రస్తులు పుట్టుకొస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బహుళ ఔషధ చికిత్స(మల్టీడ్రగ్ థెరపీ) ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఈ మందులను మొదటి నెల వైద్యుని వద్ద, రెండవ నెల నుంచి ఏఎన్‌ఎం ద్వారా ఇంటి వద్దే మందులు తీసుకోవచ్చు. వైద్యులు సూచించిన మేర నిర్ణీత కాలానికి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది.
కుష్టువ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు 15 రోజుల పాటు కుష్టు వ్యాధిపై స్పర్శ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని గ్రామ పంచాయతీల్లో, వార్డు సచివాలయాల్లో వ్యాధిపై ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులచే గ్రామసభలు నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమం ద్వారా కొత్త కేసులను గుర్తించి చికిత్స ప్రారంభించడం, ఇలాంటి వారి పట్ల వివక్ష చూపకుండా చేయడం, వారిలో అంగవైకల్యాన్ని తగ్గించడం, కొత్త కేసుల సంఖ్యను తగ్గించడం ఉద్దేశం.
– డాక్టర్ ఎల్.భాస్కర్, డీఎంహెచ్‌వో, కర్నూలు
సంవత్సరం కేసులు
2018-19 531
2019-20 506
2020-21 136
2021-22 173
2022-23 188
2023-24 278
2024-25 214
2025-26లో 173
ఇప్పటి వరకు
కుష్టు వ్యాధి లక్షణాలు...!
ఈ వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెప్రి అను బ్యాక్టిరియా వల్ల వస్తుంది.
రోగి తుమ్మడం, దగ్గడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి లక్షణాలు కనిపించేందుకు మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది.
స్పర్శలేని మచ్చలు, ముఖం, చెవులు, ఛాతి, వీపుపై నొప్పిలేని బుడిపెలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, వాపులు ఉండటం, ముక్కుదూలం అణిగిపోయి గాలి ఆడక పోవడం, బొటనవేలు, చిటికెనవేలు, మణి కట్లు పనిచేయకపోవడం, కాలి వేళ్లునేలకు రాసుకోవడం, పాదాలు, చేతులపై బొబ్బ లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏటా నమోదవుతున్న కొత్త కేసులు
ఈ ఆర్థిక సంవత్సరంలో
173 కేసుల నమోదు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఉచితం
నేడు జాతీయ కుష్టు వ్యాధి
వ్యతిరేక దినోత్సవం
కుష్టు వ్యాధికి ఏదీ కళ్లెం!


