ఏటీఎం దొంగ దొరికాడు
నంద్యాల: బ్యాంకు పాసుపుస్తకంలో లావాదేవీల ప్రింటింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడిని ఏ మార్చి ఏటీఎం ద్వారా రూ.1.24లక్షలు నగదు కాజేసిన దొంగ పట్టుబడ్డాడు. నంద్యాల ఏఎస్పీ మందా జావలి తెలిపిన మేరకు వివరాలు.. గత నెల 29వ తేదీన శ్రీనివాససెంటర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన వృద్ధుడు సుబ్బరాయుడు బ్యాంకు పాసు పుస్తకంలో ప్రింటింగ్ కోసం వచ్చాడు. అక్కడే కాపుకాచి ఉన్న వెల్దూర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దండన్నగారి సిద్దేష్ ఆ వృద్ధుడిని మాటల్లో పెట్టి నగదు డ్రా చేసుకుంటే ప్రింటింగ్ వస్తుందని నమ్మబలికించాడు. దీంతో ఆ వృద్ధుడు రూ.1000 తీసి ఇవ్వమని ఏటీఎం ఇచ్చి పిన్ నంబరు చెప్పాడు. డబ్బు డ్రా తర్వాత వృద్ధుడికి నకిలీ ఏటీఎం ఇచ్చాడు. అతను ఇంటి వద్దకు వెళ్లిన కొద్ది సేపటికే బ్యాంకు ఖాతాలో రూ.1.24 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో బాధితుడు వెంటనే వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బ్యాంకు వద్ద, ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని గుర్తించి బుధవారం నంద్యాల బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడు ఇదే తరహాలో కర్నూలు, ఆదోని, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్లు 11 కేసులు ఉన్నాయని ఏఎస్పీ వెల్లడించారు. ఏటీఎంల వద్దకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇవ్వడం, పిన్‌నంబరు చెప్పడం చేయవద్దని ఆమె సూచించారు. అలాగే బ్యాంకుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సురేష్, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీఅభినందించారు.


